ఏపీ ప్రభుత్వం భీమ్లానాయక్ సినిమాను ఎంతలా నియంత్రించాలని చూసిందో అందరూ చూశారు. ఇలాంటి వారిపై ఏపీ ప్రభుత్వ మంత్రులు విరుచుకుపడడ్డారు. వారికి అలవాటైన లాంగ్వేజ్‌లో ఎవరూ మళ్లీ నోరు చేసుకోలేని విధంగా స్పందించడంలో పోటీ పడ్డారు. చివరికి ఆదివారం పొద్దునే కొడాలి నాని కూడా తమ పంచాంగం వినిపించారు. అదంతా ఓవైపు సాగుతూంటేనే .. ప్రకాష్ రాజ్ ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు . ప్రశాంత్ కిషోర్, కేసీఆర్‌తో జాతీయ రాజకీయాల అంశంలో చర్చల్లో బీజీగా ఉంటూనే టాలీవుడ్ అంశంపైనా స్పందించారు.
సినిమా పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. సినిమాను రాజకీయాలతో కలిపి చూడడం సరికాదన్నారు. ‘సృజన సాంకేతికత మేళవించిన సినిమా రంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి? చిత్ర పరిశ్రమను క్షోభపెడుతూ మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు.’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్‌కు మద్దతుగా మాట్లాడిన వారిపైనా మంత్రులు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేతలపై తమదైన భాషా ప్రయోగం చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పవన్ కల్యాణ్ తరపున ప్రకాష్ రాజ్‌కు మద్దతు లభించింది. ఆయనపైనా ఏపీ మంత్రులు విరుచుకుపడతారేమో చూడాలి. అయితే గతంలో ఆర్జీవీ విరుచుకుపడినా ఆయనను ఏమీ అనలేదు. పిలిచి భోజనం పెట్టించి పంపారు పేర్ని నాని. బహుశా ప్రకాష్ రాజ్ జోలికి కూడా వెళ్లకపోవచ్చని భావిస్తున్నారు.