ధమాకా.. సూపర్ హిట్ లో రచయిత ప్రసన్న కుమార్ బెజవాడది కీలక స్థానం. ప్రసన్న కామెడీ టైమింగ్, చేసిన కొన్ని జిమ్మిక్కులు (పల్సర్ బండి పాట) వల్ల సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. రవితేజ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమా ఇదే. అంతకు ముందు ప్రసన్నకుమార్కి ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా.. నాగార్జున దర్శకుడిగా ఆఫర్ ఇచ్చాడు. నాగ్ 99వ సినిమాకి తనే దర్శకుడు. నాగ్ సినిమాతో దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్తయ్యింది. వచ్చే నెలలో షూటింగ్ మొదలయ్యే ఛాన్సు ఉంది.
అయితే సడన్గా ఈ సినిమా నుంచి ప్రసన్న కుమార్ బెజవాడ తప్పుకొన్నట్టు తెలుస్తోంది. దర్శకత్వ బాధ్యతల్ని మరొకరు స్వీకరించబోతున్నార్ట. ప్రసన్న కావాలని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నాడా, లేదంటే నాగ్ పక్కన పెట్టాడా? అనే చర్చ నడుస్తోంది. అయితే ప్రసన్న స్క్రిప్టుని మాత్రం యధాతధంగా వాడుకొంటున్నట్టు సమాచారం. నాగ్ ప్రస్తుతం సమ్మర్ వెకేషన్లో ఉన్నాడు. ఈ వారంలోనే తిరిగి వస్తాడు. రాగానే కొత్త దర్శకుడి పేరుని అధికారికంగా ప్రకటిస్తారని టాక్.