వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత లండన్‌లో ఉన్నారు. కానీ నియోజకవర్గాల్లో ఆశావాహులను పిలిచి మాట్లాడటం… అసంతృప్తుల్ని బుజ్జగించడం లాంటి వ్యవహారాల కోసం… నేతల్ని హైదరాబాద్ పిలిపించడం.. కామన్‌గా మారిపోయింది. నియోజకవర్గాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్న చోట… వారందర్నీ హైదరాబాద్‌కు పిలిపిస్తున్నారు. హైదరాబాద్‌లో వైసీపీ ముఖ్యనేతలెవరూ లేరు. జగన్ లండన్‌లో ఉన్నారు. విజయసాయిరెడ్డి, వై.వి సుబ్బారెడ్డి లాంటి వాళ్లు.. బుజ్జగింపుల బాధ్యతలు తీసుకోరు. వారు జిల్లాల పర్యటనలో ఉన్నారు. మరి ఎవరు… అసంతృప్తుల్ని బుజ్జగిస్తున్నారంటే… దానికి సమాధానం .. ప్రశాంత్ కిషోర్ అండ్ టీం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్ చేతుల్లో లేదని.. ఆయన పార్టీలోని ప్రతి పనిని ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చారని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని.. వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు. పార్టీలో నాలుగేళ్ల పాటు పని చేసి… అప్పులు చేసి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నేతలకు చివరిలో.. సర్వే పేరుతో.. ఝులక్ ఇస్తున్నారు. సర్వేలో.. మీకు అనుకూలత లేదని చెప్పి.. అప్పుడే పార్టీలోకి వచ్చిన వారికో.. వస్తామన్న వారికో.. టిక్కెట్ ఖరారు చేస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటని అడుగుతున్న సమన్వయకర్తలకు.. ప్రశాంత్ కిషోర్ అండ్ టీం.. బుజ్జగింపులు చేస్తోంది. పార్టీ గెలిస్తే.. అది చేస్తాం.. ఇది చేస్తాం అని హామీ ఇస్తున్నారు. కానీ… అది చెప్పడానికి.. పీకే ఎవరు.. అన్న భావన పార్టీ నేతల్లో ఏర్పడిపోతోంది. వారు జగన్ నుంచి హామీ కోరుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… అలాంటివేమీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. పైగా.. ఇంత కాలం పని చేసిన వారికి టిక్కెట్లు ఎందుకివ్వడం లేదు అంటే.. సర్వేలను కారణంగా చూపిస్తున్నారు. ఆ సర్వేలపైనే… టిక్కెట్లు దక్కని.. సమన్వయకర్తలు.. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ సామాజికవర్గ లెక్కలు వేసుకుని.. తయారు చేసిన రిపోర్ట్ అని.. క్షేత్ర స్థాయిలో చేసినవి కాదని వారంటున్నారు.
పీకే అండ్ టీం మాత్రం.. ఈ బుజ్జగింపుల్ని హైదరాబాద్‌లోని .. కార్పొరేట్ పద్దతిలో నిర్వహిస్తున్నాయి. అంతిమంగా.. పార్టీ నేతలకు.. ఉంటే ఉండండి.. పోతే పొండి అన్న రీతిలో సున్నితంగా చెప్పి పంపిస్తూండటంతో… వైసీపీ నేతలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పార్టీ అధినేత చూసుకోవాల్సిన విషయాలను ఇలా ఓ కంపెనీకి ఔట్ సోర్సింగ్‌కు ఇవ్వడం ఏమిటో… వారు తమను.. రాజకీయ నేతల్లా కాకుండా.. మార్కెటింగ్ స్టాఫ్‌గా పరిగణించడం ఏమిటో… వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.