ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు కానీ.. ప్రశాంత్ కిషోర్ లేకపోతే వారెవరూ అక్కడ ఉండేవారు కాదని వారికీ తెలుసు. ఈ విషయం జగన్ కూ వర్తిస్తుంది. 2014 ఎన్నికల్లో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ ప్రశాంత్ కిషోర్ ను బతిమాలి మాట్లాడుకుని వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఏపీలో ఉండే కుల రాజకీయాల్ని ఆసరాగా చేసుకుని పీకే వేసిన గేమ్ ప్లాన్ తో సక్సెస్ అయ్యారు.
తన విజయంలో పీకే పాత్ర ఎంత ఎక్కువగా ఉందో జగన్ చాలా సార్లు చెప్పారు. ఓ సారి ప్లీనరీకే ఆహ్వానించారు. మనల్ని పీకే గెలిపించబోతున్నాడని అందరికీ పరిచయం చేశారు. అంటే జగన్ దేమీ లేదా అని క్యాడర్ అనుకున్నా సరే జగన్ అదే చెప్పారు. తర్వాత పోలింగ్ అయిన సందర్భంలోనూ ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. అప్పుడు గెలుపు ముంగిట ఉన్నట్లుగా అంచనాకు వచ్చి ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తున్నారని ప్రశంసించారు.
ఇప్పుడు ఐదేళ్లు అయిపోయిన తర్వాత చూస్తే.. అదే ప్రశాంత్ కిషోర్ ను.. అదే నోటితో జగన్ రెడ్డి నథింగ్ అంటున్నారు. ఆయన చేసిందేమీ లేదు.. ఆయన టీమే అంతా చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ విషయంలో సైలెంట్ గా ఉన్నా సరిపోయేదేమో కానీ.. ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జగన్ వ్యక్తిత్వానికి సాక్ష్యంగా మారింది. కృతజ్ఞత లేకపోవడం అన్నది మహా పాపమని భగవద్గీతలో ఉందని .. రవిప్రకాష్ ఇంటర్యూలో ప్రశాంత్ కిషోర్ అన్నారు. అది నిజమేనని నిరూపించారు జగన్మోహన్ రెడ్డి.