విపక్షంలో ఉండి సాఫీగా ఎన్నికల ప్రణాళికలు వేసుకోవాల్సిన వైసీపీ.. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల కన్సల్టెంట్ చేతిలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. ఈ బీహారీ వైసీపీ నేతలను.. బీహారీల్లాగానే ట్రీట్ చేస్తున్నారు. చివరికి విజయసాయిరెడ్డికి కూడా అదే తరహా ట్రీట్మెంట్ ఇవ్వడం… వైసీపీలో కలకలం రేపుతోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నేరుగా అభ్యర్థులను ఇంటర్యూ చేస్తున్నారు. ఈ సమయంలో.. ఆ ఇంటర్యూల్లో ఉండేందుకు వెళ్లిన విజయసాయిరెడ్డిని పీకే బృందం.. బయటకు పంపేసింది. ఇది బయటకు తెలియడంతో.. వైసీపీలో రచ్చ ప్రారంభమయింది.
రెండున్నర సంవత్సరాల క్రితమే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహ కర్తగా పేరు గాంచిన ప్రశాంత్ కిషోర్ ను కన్సల్టెంట్ గా పెట్టుకున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశంలో నేరుగా ప్రశాంత్ కిషోర్ ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు జగన్. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ పక్కనే కూర్చుని సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కానీ ఆయన బృందం మాత్రం లోటస్ పాండ్ కు సమీపంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని అనధికారికంగా వైసీపీని నడిపించడం ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రశాంత్ కిషోర్ మళ్లీ ఎపీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన వైసీపీ అభ్యర్దులను ఎంపిక చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు.
ఆయన బృందం సర్వేలు చేసి తీసుకు వస్తుంది. ఆయన వాటిని విశ్లేషించి.. వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. సర్వే నివేదిక ప్రకారం అభ్యర్దులను పిలిపించి తొలుత ప్రశాంత్ కిషోర్ వారితో మాట్లాడతారు. ఖరారు చేసిన అభ్యర్ధిని చివరకు జగన్ వద్ద ప్రవేశపెడుతున్నారు. ఈ వ్యవహారం అంతా వైసీపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వైసీపీలో చేరబోయే నేతలకూ అదే తరహా ట్రీట్మెంట్ ఎదురవుతోంది. వైసీపీలో చేరేందుకు వెళ్లిన ఓ టీడీపీ నేతను.. ముందుగా… పీకే బృందం క్యాంప్ వేసిన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ పీకే ఇంటర్యూ చేసిన తర్వాతే జగన్ వద్దకు పంపారు. పార్టీలో చేరిన తర్వాత ఏం మాట్లాడాలి.. అనేది కూడా పీకే టీంనే డిసైడ్ చేసింది. అంతో ఇంతో సీనియర్ను అయిన తనకు .. ఇలాంటి పరిస్థితి రావడంపై ఆయన మథనపడ్డారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి చేతులు ఊపుకుంటూ కూర్చుకుని.. మొత్తం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పీకేకి అప్పగించడం వైసీపీలో కలకలం రేపుతోంది.