తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడిప్పుడు ఏకతాటిపైకి వచ్చి టీఆర్ఎస్పై పోరాడుతున్నారు. కానీ మధ్యలో సంబంధం లేకపోయినా ప్రశాంత్ కిషోర్ దూరి ఆ పార్టీని నానా తిప్పలు పెడుతున్నారు. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానంటూ ఓ బ్లూప్రింట్‌ను సోనియాకు సమర్పించారు. అలా చేసినప్పుడు ఇతర పార్టీలతో భేటీ కాకుండా ఉండాల్సింది. కానీ హైదరాబాద్ వచ్చి రెండు రోజుల పాటు కేసీఆర్‌తో చర్చలు జరిపి వెళ్లారు. పీకే సంస్థ ఐ ప్యాక్ టీఆర్ఎస్తో పని చేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చారు.
అంటే… కాంగ్రెస్ లో ఉంటూ టీఆర్ఎస్కు పని చేస్తారా అన్న సెటైర్లు ప్రారంభమయ్యాయి. పీకే కాంగ్రెస్‌లో చేరినా చేరకపోయినా … తెలంగాణలో చేసేదేమీ లేదని.. తమ పోరాటం.. తమ వ్యూహాలు అమలు చేసుకుంటామని.. జాతీయ రాజకీయాల్లో పీకే ఏం చేయాలి.. ఏం చేస్తారనేది హైకమాండ్ చూసుకుంటుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. అయితే పీకే కేసీఆర్‌తో భేటీ కావడం వల్ల రెండు పార్టీల మధ్య పొత్తు కలుపుతారనే ప్రచారాన్ని బీజేపీ నేతలు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ నేతలకు మరింత ఇబ్బందికరంగా మారింది.
నిజానికి పీకే తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేయాలని రిపోర్టు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం . అయితే కేసీఆర్ బీజేపీ కన్నా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపుతారన్న ఓ ప్రచారాన్ని మాత్రం ప్రజల్లో నమ్మించగలిగేలా ప్రారంభిస్తే అది కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే టీ కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారు అటు పీకేను విమర్శించలేక.. ఇటు కేసీఆర్‌తో పీకే భేటీని సమర్థించలేక తంటాలు పడుతున్నారు.