సాధారణంగా రాజకీయ నాయకులంటే కోట్లకు పడగలెత్తి ఉంటారు. ఎన్నికల్లో ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలవాలనుకుంటారు. ఒకవేళ ఏదైనా పదవిలోకి వస్తే.. వందల కోట్లు సంపాదిస్తారు. నేటి తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులు చేస్తున్నదిదే. కానీ ఒడిశాకు చెందిన ప్రతాప్ సారంగి మాత్రం ఈ అభిప్రాయాన్ని మార్చేశారు.
సామాన్యుల్లో అసామాన్యుడు ఈ సారంగి..!
ఒడిశా మోదీగా ప్రతాప్ సారంగి ఇటీవల మీడియాతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. బాలాసోర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సారంగి ఇప్పుడు కేంద్రమంత్రి అయ్యారు. ఆయన ప్రమాణస్వీకారం చేసే సమయంలో పలువురు ప్రముఖులు, కార్యక్రమానికి హాజరైన అతిధులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారంటే సారంగి గొప్పతనమేంటో అర్థం అవుతుంది. సారంగి నిరాడంబర జీవితం, సైద్దాంతిక నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈకారణంగానే కేంద్ర సహాయమంత్రి బెర్త్ దక్కింది. పశుసంవర్థక, మత్స్యశాఖను మోడీ కేటాయించారు.
ప్రతీ పైసా సంపాదన గిరిజనులకే..!
గిరిజనుల కోసం జీవితం అంకితం చేసిన 64ఏళ్ల సారంగికి ఎంతోకాలంగా బీజేపీతో అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ కార్యకర్త అయిన 2004, 2009 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో నీలగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పదవిలో ఉన్నప్పుడు తనకు అందే జీత భత్యాల, ఆ తర్వాత వస్తున్న పెన్షన్‌ను గిరిజన ప్రాంతాల్లో పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తున్నారు. 2014లో బాలాసోర్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓటమి పాలైన సారంగి.. ఈసారి ఎన్నికల్లో దాదాపు 12వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఎంపీగా గెలుపు..!
ప్రతాప్ చంద్ర సారంగి తనకు జీతంగా వచ్చే సొమ్మునంతా ప్రజా సేవకే వినియోగిస్తూ వస్తున్నారు. ఇక ఈయన్ని చూస్తే సాధారణంగా కనిపిస్తారు. కుర్తా పైజామాలు ధరిస్తారు. భుజానికి ఎప్పుడూ బ్యాగ్ ఉంటుంది. గుబురు గడ్డం ఉంటుంది. అస్సలు ఆడంబరంగా కనిపించరు. సాధారణ జీవితం గడుపుతున్నారు. అలాగే బయటకు వెళ్లాలంటే కేవలం సైకిల్‌పైనే వెళ్తారు. ఇక ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎలాంటి ప్రచారం లేకుండానే, డబ్బు ఖర్చు పెట్టకుండానే సారంగి ఎంపీగా గెలిచారు. ఇదీ ఇయన గొప్పతనం. ఈ నిరాడంబరతే కేంద్రమంత్రివర్గంలో సహాయ మంత్రిని చేసింది.