ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులపై కోపంతో.. పంతానికి పోయి చేయకూడని పనులు చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులందరికీ జీతాలు జమ చేస్తే పీఆర్సీ అమల్లోకి వచ్చేసినట్లేననన్న భావనతో అందరికీ జీతాలు జమ చేసేంది. అయితే ఉద్యోగులు సహకరించకపోవడంతో ప్రైవేటు ఏజెన్సీతో పని పూర్తి చేసింది. సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్ వేర్ సాయంతో ప్రైవేటు ఏజెన్సీ సాయంతో మూల వేతనం, హెచ్ఆర్ఏ, డీఏలు లెక్కించి జీతాలు జమ చేసింది.
అయితే ఆర్థిక శాఖకు సంబంధించి కొన్ని కోడ్లు ఉంటాయి. అవి అధికారుల వద్ద ఉంటాయి. అవి రహస్యం. ప్రైవేటు సంస్థలకు తెలియనివ్వకూడదు . కానీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా వారికి జీతాలివ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ కోడ్లను ప్రైవేటు సంస్థలకు ఇచ్చి తమ పంతం నెగ్గించికుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. రేపు ఈ అంశంపై న్యాయవివాదాలు ఏర్పడితే కోర్టుకు వెళ్లాల్సింది ఎవరని ప్రశ్నిస్తున్నారు.
ప్రైవేటు సంస్థ సహకారంతో ప్రభుత్వం జమ చేసిన ఉద్యోగుల తప్పుల తక్కెడగా ఉన్నాయి. రిటైరైన వారికి, చనిపోయిన వారికి… ఇలా అందరికీ జీతాలు పడ్డాయి. సీఎఫ్ఎంఎస్లో ఉద్యోగుల డేటా అప్ డేట్ కాలేదు. ఈ కారణంగా ఎవరెవరికి జీతాలు ఇస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ప్రభుత్వానికి కొన్ని కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. వాటిని వెనక్కి తీసుకోవాల్సిన పని ట్రెజరీ ఉద్యోగులదే. కానీ వారిప్పుడు పని చేసే పరిస్థితుల్లో లేదు.
ప్రభుత్వం ఉద్యోగుల్ని గౌరవించకుండా వారి అభిప్రాయాలను ఆలకించకుండా ఇష్టారీతిన చేసుకుంటూ పోతూంటే అన్నీ గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పంతాలకు పోకుండా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం ప్రభుత్వం వద్దనే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.