ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం… అట్టహాసంగా జరిగింది. ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన తర్వాత ఆమె యూపీలో అడుగు పెట్టి.. ఘనస్వాగతాన్ని పొందారు. లక్నోలో దాదాపు 30 కిలోమీటర్లు సాగిన ప్రియాంక రోడ్ షోకు పార్టీ కార్యకర్తలు అడుగడుగునా నీరాజనం పట్టారు. ప్రియాంక రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. లఖ్ నవ్ ర్యాలీతో యూపీ జనంలో కూడా కాంగ్రెస్ పట్ల నమ్మకం పెరిగే అవకాశం కనిపిస్తోంది. కలిసి పనిచేద్దాం.. రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టిద్దాం.. అంటూ ప్రియాంక తొలి సందేశం ఇచ్చేశారు. పార్టీలో ప్రతీ ఒక్కరు కష్టపడి పనిచేస్తూ గెలుపులో వాటాదారులు కావాలని ఆమె ఆకాంక్షించారు. దీనితో ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన కింది స్థాయి కాంగ్రెస్ శ్రేణులు ప్రియాంకను చూసేందుకే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు వీధుల్లోకి వచ్చేశారు.
7 ఏళ్ల ప్రియాంక దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటారని లఖ్ నవ్ ర్యాలీ చెప్పకనే చెప్పింది. ఎంతో కాలం ఆలోచించి, తర్కించి రాహుల్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు అంగీకరిస్తున్నారు. ర్యాలీకి వచ్చిన జనాన్ని చూస్తే వారి ఆలోచన కరెక్టేననిపించింది. ఒక్క ర్యాలీ కార్యకర్తలను ఉత్తేజ పరచడమే కాకుండా యూపీ రాజకీయ గతిని మార్చేస్తుందని కూడా నమ్ముతున్నారు. నాలుగు రోజులు లఖ్ నవ్లో ఉండే పార్టీకి చెందిన ప్రతీ ఒక్క నాయకుడితో మాట్లాడతారు. కార్యకర్తలను పలుకరిస్తారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. పార్టీలో పునరుత్తేజానికి కావాల్సిన చర్యలను సమీక్షిస్తారు. యూపీ కాంగ్రెస్ కార్యకర్తలు తమకు కొత్త నాయకత్వం వచ్చేసిందన్న జోష్ లో ఉన్నారు.
యూపీలో ఎస్పీ – బీఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. చెరి 38 స్థానాల్లో పోటీ చేయాలని తీర్మానించాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం రాయ్ బరేలీ, అమేఠీ మాత్రమే వదిలేశాయి. ఎంతో ఆశగా, ధైర్యంగా ఉన్న ఎస్పీ, బీఎస్పీకి ప్రియాంక రాకతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. యూపీలో గెలుపు అంత సులభం కాదని రెండు పార్టీలు గ్రహించాయి. ఇరు పార్టీల నేతలు వ్యూహం మార్చే ఆలోచనలో ఉన్నట్లు అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రియాంక ప్రచారంతో విపక్షాల ఓట్లు చీలిపోయి బీజేపీకి ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని రెండు పార్టీలు అనుమానిస్తున్నాయి. దానితో ఇప్పుడు బేరానికి రాక తప్పడం లేదు. కాంగ్రెస్కు 12 నుంచి 15 స్థానాలు కేటాయించి పొత్తులో భాగస్వామిని చేసుకుంటే అత్యధిక ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని రెండు పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. త్వరలో పొత్తు చర్చలు ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు.