అధికారంలో ఉన్నప్పుడు మీడియా అంతా కేటీఆర్ అంటే అటెన్షన్ తో ఉండేది. ఆయన ఎక్కడ మాట్లాడితే అక్కడ లైవ్ పెట్టారు. అధికారం పోగానే పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. స్వేదపత్రం పేరుతో చాలా కసరత్తు చేసి ప్రజెంటేషన్ ప్రకటిస్తే.. కనీస కవరేజీ కూడా ఇవ్వలేదు మీడియా. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఎవరూ పట్టించుకోలేదు.
ప్రభుత్వం ప్రకటించిన వైట్ పేపర్ కు కౌంటర్ గా కేటీఆర్ ప్రకటించిన స్వేదపత్రం తేలిపోయింది. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అధికారంలరో ఉన్నప్పుడు చెప్పినప్పటి లెక్కలే ఆయన తన రికార్డుల్లో చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినవన్నీ తప్పులన్నారు .. తాము చెప్పేవే నిజాలని వాదించారు. 2013-14లో రూ.1,12,162గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 2022-23 నాటికి రూ.3,17,115కు చేర్చామని స్వేదపత్రంలో పేర్కొన్నారు. ఇక జీఎస్డీపీ 2013-14లో రూ.4.51 లక్షల కోట్లుగా ఉండగా 2022-23 నాటికి రూ.13.27 లక్షల కోట్లకు పెరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు, అవార్డులు అందాయని, విద్యుత్ విధానం, నూతన వ్యవసాయ విధానం, తాగునీటి, సాగునీటి విధానాలు, పరిపాలనా సంస్కరణలు, కొత్త చట్టాల విషయంలో ప్రశంసలు అందుకున్నామన్నారు.
పల్లె ప్రగతి కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని, కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని నిరర్థకం అంటే.. మూర్ఖత్వమేనన్నారు. ‘మేం కట్టిన సచివాలయంలో మీరు కూర్చున్నారు’ సచివాలయాన్ని కూడా నిరర్ధకం అంటే అది నిరర్థకమా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉపాధి అవకాశాల గనిగా మారిందన్నారు. అప్పులు కూడా ఆరు లక్షలు లేవని.. మూడు లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఆర్బీఐ, కాగ్ ఇతర సంస్థలు చెప్పిన లెక్కలేన్నారు.
సమావేశంలో కాంగ్రెస్ పై ఎక్కువ విమర్శలు చేయడానికి సమయం కేటాయించారు. అధికారం పోవడంతో మీడియా వారికి అధిక కవరేజీ ఇస్తే.. రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎక్కడ కోపం వస్తుందోనని లైట్ తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ కు ఉన్న పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కు వచ్చేలా కనిపిస్తోంది.