కేబినెట్లో సీఎం జగన్ మార్పుచేర్పులు చేయబోతున్నారని వైసీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇలా చేయడం అంటే… మన ఇంటికి మనం నిపెట్టుకోవడమే అన్న ఆందోళన వైసీపీ సీనియర్లలో వ్యక్తమవుతోంది. దీనికి కారణం క్యాడర్.. లీడర్లలో పెరిగిపోయిన అసంతృప్తి ఎమ్మెల్యే స్థాయిలో వ్యాపించడమే. తాము పదేళ్లుగా ఎన్నో అష్టకష్టాలు పడి జగన్ వెంట నడిస్తే అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రయోజనం లేకపోగా… ప్రత్యర్థులకు .. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తి మెజార్టీ ఎమ్మెల్యేల్లో ఉంది. కనీసం అపాయింట్ మెంట్లు కూడా ఇవ్వడం లేదంటున్నారు.
పైగా జగన్ ఇప్పుడు పార్టీపై పట్టు కోల్పోయారు. ఏడాది కిందట వరకూ సీఎం జగన్ ఏది చెబితే అది శాసనం. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన తర్వాత సీన్ మారిపోయింది. ఆయన పై ఎమ్మెల్యేలు చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాటలను కూడా వినిపించుకోలేదు. ఎమ్మెల్యేలపై సీఎం జగన్కు పూర్తి స్థాయి పట్టు ఉందని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది పూర్తిగా నిజం కాదని తేలిపోయింది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ధిక్కరించి ప్రతిపక్ష పార్టీకి ఓటు వేయడం అంటే చిన్న విషయం కాదు. అదీ కూడా ఏడాదిపైగా అధికారం ఉన్న సమయంలో. అధికార పార్టీకి విపక్ష సభ్యులు మద్దతిస్తే అందులో ఓ లాజిక్ ఉంటుంది . కానీ పార్టీపై పూర్తి స్థాయిలో పార్టీపై పట్టు ఉన్నట్లుగా భావిస్తున్న జగన్ పార్టీలో ఇలా జరగడం మాత్రం ఆశ్చర్యమే కాదు.
ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం జరగడమూ ఇబ్బందికరమే. వీరిలో పార్టీలో …ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తిలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇలాంటి వారిని కంట్రోల్ చేయడం కష్టమే. ప్రస్తుతం పదవుల్ని కోల్పోయే మంత్రులు కూడా అసహనానికి గురవుతారు. తమను పనికి రాని వాళ్లుగా తేల్చి తీసేస్తున్నారని వారు ఫీలయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే సీఎం జగన్ ఇప్పుడు కత్తిమీద సాములా కేబినెట్లో మార్పుచేర్పులు చేయాల్సి ఉంది. మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే అదే రోజు నుంచి వైసీపీలో అసలైన మ్యూజిక్ ప్రారంభమవుతుందన్న వాదన వినిపిస్తోంది.