జనసేన పార్టీని జనంలోని మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లడానికి ఏర్పాటైన విభాగమే శతఘ్ని. పార్టీ తరఫున ఐటీ, సోషల్ మీడియాలో క్రియాశీలమైన పాత్ర పోషించేందుకు ఇది ఏర్పడింది. ఇకపై ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలున్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుంచీ పోటీకి పవన్ సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శతఘ్ని టీమ్ కి కార్పొరేట్ లుక్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం.
మొత్తంగా, మూడు కొత్త ఆఫీస్ ల ద్వారా శతఘ్ని అతి త్వరలో పనులు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ, విజయవాడల్లో రెండు ఆఫీసులు తీసుకున్నట్టు సమాచారం. మూడో ఆఫీస్ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో పెట్టబోతున్నారు. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. శతఘ్ని ఆధునీకరణకు కావాల్సిన నిధులను నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నట్టు సమాచారం. రవితేజ హీరోగా త్వరలో రాబోతున్న ‘నేల టికెట్’ నిర్మాత ఈయనే. ఈయన ఎన్నారై, క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారు. దాని కోసం జనసేనను ఎంచుకున్నారు. అందుకే, ఈయన ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించి చాలా అవసరాలను తీర్చుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ తలపెట్టిన బస్సుయాత్రకు కూడా రామ్ తాళ్లూరి సహాయం చాలానే ఉందట. అమెరికాతోపాటు, హైదరాబాద్ లో కూడా ఆయనకి కొన్ని కంపెనీలున్నాయి.
ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ పార్టీ నిర్మాణంపై పవన్ ప్రత్యేక దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల అవసరం చాలా ప్రముఖంగా మారిపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ కూడా ప్రత్యేకమైన ఐటీ వింగ్ ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించింది. 2019 ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలూ ఐటీ, సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం నూటికి రెండొందల శాతం ఉంది. కాబట్టి, ఈ క్రమంలో జనసేన కూడా కార్పొరేట్ స్టైల్లో శతఘ్నిని నిర్వహించాలని భావిస్తోంది.