షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి? థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయి? – ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. లాక్ డౌన్ వల్ల, షూటింగులు ఆపేయడం వల్ల, థియేటర్లు మూసేయడం వల్ల చాలా నష్టపోతున్నామని, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని, చిత్రసీమకు లాక్ డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు ఇవ్వాలని చిత్ర సీమ కోరుకుంటోంది. అటు తెలంగాణ ప్రభుత్వంతోనూ, ఇటు ఏపీ ప్రభుత్వంతోనూ చిత్రసీమ చర్చలు జరపడానికి కారణం ఇదే. షూటింగులకు అతి త్వరలో అనుమతులు రావొచ్చని, థియేటర్ల రీ ఓపెనింగ్‌కి మాత్రం చాలా సమయం ఉందని భావిస్తున్నారు.
అయితే థియేటర్లు తెరచుకోవడం విషయంలో నిర్మాతలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. థియేటర్లు తెరచుకోకపోతే.. అప్పుల పాలైపోతామని కొంతమంది నిర్మాతలు భయపడుతుంటే, థియేటర్లు తెరచుకుంటే ఆ నష్టాలు మరింత ఎక్కువ అవుతాయని ఇంకో వర్గం అభిప్రాయ పడుతోంది. ఇప్పట్లో థియేటర్లు తెరవకపోవడమే మంచిదన్నది సురేష్‌బాబు మాట. కొన్ని దేశాలలో థియేటర్లు తెరిచారని, అయితే అక్కడ అనుకున్న ఫలితాలు రాలేదని, కరోనా భయాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారని చెప్పుకొచ్చారు సురేష్‌బాబు.
”పరిశ్రమలోని యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ 20 మంది వరకూ ఉన్నారు. వాళ్లందరిని పిలిచి.. థియేటర్లు తెరవాలా,, వద్దా? అని అడిగితే… వద్దు అనే సమాధానం చెబుతారు. చాలామంది నిర్మాతలు వేచి చూద్దామనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు తొందరపడి థియేటర్లు తెరవడం వల్ల నష్టాలు ఎక్కువ అవుతాయి. భవిష్యత్తులో థియేటర్ వ్యవస్థ మరింత కృంగిపోయే ప్రమాదం ఉంది. నవంబరు డిసెంబరు వరకూ థియేటర్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది” అని సలహా ఇచ్చారు.