ఈనెల 15 నుంచి థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. అందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది. కేవలం 50 శాతం సిట్టింగ్ కే అనుమతి. ఆట ఆటకీ మధ్య శానిటైజేషన్ తప్పనిసరి. టికెట్లన్నీ వీలైనంత వరకూ ఆన్ లైన్లోనే అమ్మాలి.
ఎప్పటి నుంచో థియేటర్ల పునః ప్రారంభం కోసం ఎదురు చూస్తున్న దర్శక నిర్మాతలకు ఇది శుభవార్తే. అక్టోబరు 15 నుంచి థియేటర్లు ఓపెన్ అవ్వడం సంతోషకరమైన విషయమే. కానీ.. అప్పటికి సినిమాలు రెడీగా ఉన్నాయా? తమ సినిమాల్ని విడుదల చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధమేనా అన్నదే ప్రధాన ప్రశ్న.
50 శాతం ఆక్యుపెన్సీ అంటే సగం వసూళ్లని వదులుకోవడమే అవుతుంది. ప్రతీ సినిమా.. ప్రతీ షోకీ హౌస్ఫుల్ కాదు. కాకపోతే… తొలి రెండు రోజుల్లో అయినా హౌస్ ఫుల్స్ ఆశిస్తాడు నిర్మాత. కానీ ఇప్పుడు సగం థియేటర్లు నిండుతాయి అంటే.. విడుదల చేయడానికి ధైర్యం చేయడలడా? పైగా థియేటర్ల నిర్వహణ ఇప్పుడు అంత తేలికైన విషయం కాదు. ఆట ఆటకీ మధ్య శానిటైజేషన్ చేయడం, పరిశుభ్రత పాటించడం కూడా ఖర్చుతో కూడిన పనులు. మల్టీప్లెక్స్ వరకూ ఫర్వాలేదు. బీ, సీ సెంటర్లలో టికెట్లను ఇంకా కౌంటర్ల దగ్గరే విక్రయిస్తున్నారు. ఆన్ లైన్ సౌకర్యం లేని థియేటర్లు ఎన్నో ఉన్నాయి.
పెద్ద సినిమాలకు తొలి మూడు రోజుల వసూళ్లే కీలకం. ఓ స్టార్ హీరో సినిమా తొలి మూడు రోజుల్లో 20 కోట్లు వసూలు చేయగలదు అనుకుంటే, ఇప్పుడు అది 10 కోట్లకు పడిపోతుంది. ఈ నష్టానికి నిర్మాత సిద్ధపడాల్సివస్తుంది. అలాగని టికెట్ల రేట్లు పెంచే సాహసం ఎవరూ చేయకపోవొచ్చు. ఎందుకంటే ఇది కరోనా సమయం. జీతాలు తగ్గి, ఖర్చులు పెరిగి సగటు జీవి విలవిలలాడిపోతున్నాడు. ఇలాంటి సమయంలో టికెట్ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుంది. పెద్ద సినిమాల వరకూ.. కాస్త ధైర్యంగానే ఉండొచ్చేమో. చిన్న సినిమాలకు మరింత నష్టం వాటిల్లు తుంది. మౌత్ టాక్ ద్వారా.. వాటికి జనాలు రావాలి. అది వచ్చే నాటికి.. సినిమా థియేటర్లో ఉండకపోవొచ్చు. సగం సిట్టింగే కదా అని అద్దెలు తగ్గవు, నిర్వహణా వ్యయమూ తగ్గదు. ఇవన్నీ సమస్యలే.
అయినా.. అక్టోబరు 15 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే చిత్రాలు మహా అయితే 10 ఉంటాయని టాలీవుడ్ జనాల మాట. వాటిలో కొన్ని ప్రస్తుతం ఓటీటీలతో బేరాలు చేసుకుంటున్నాయి. మరికొన్ని దసరా, దీపావళి కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబరు 15న థియేటర్లు ఓపెన్ అయినా, థియేటర్లో బొమ్మపడడానికి ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సివస్తుంది.