కోల్‌కతాలో .. విపక్షాలన్నీ ఐక్యంగా భారీ ర్యాలీ నిర్వహించాయి. కలసికట్టుగా మోడీని గద్దె దింపుతామని.. దేశాన్ని కాపాడతామని ప్రకటించాయి. బీజేపీ పాలనపై ప్రాంతీయ పార్టీల నేతలంతా తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. బీజేపీ కూడా.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. అవినీతి పరులంతా ఏకమయ్యారని…మండిపడింది. ఎంత మంది కలిసిన బీజేపీని మళ్లీ గెలవకుండా ఆపలేరని చెబుతున్నారు. అయితే.. బీజేపీ నుంచి వచ్చిన ప్రధానమైన ప్రశ్న… మాకు మోడీ ఉన్నరు.. మీకు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అన్నదే..!
కోల్‌కతా సభతో మమతా బెనర్జీ ఏం సందేశం ఇచ్చారు..?
విపక్షాల ఐక్య కూటమికి మొదటి ముంచి ఎదురవుతున్న ప్రశ్న… మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు..? అని. భారత ప్రజాస్వామ్యం ప్రకారం… రాజ్యాంగం ప్రకారం.. మొదటగా ప్రజలు ఎంపీలను ఎన్నుకుంటారు. ఆ ఎంపీలు ప్రధానిని ఎన్నుకుంటారు. కానీ… రాష్ట్రాల్లో కానీ.. కేంద్రంలో కానీ .. కొంత కాలంగా… అధ్యక్ష తరహా ఎన్నికలు జరుగుతున్నట్లుగా.. ఓ అభ్యర్థిని ప్రజెంట్ చేసి… ఎన్నికలకు వెళ్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం అయితే.. ఎంపీలు ప్రధానిని ఎన్నుకోవాలి. కోల్‌కతా వేదికగా జరిగిన.. ప్రాంతీయ పార్టీల కూటమి కూడా.. దాదాపుగా ఇదే సందేశాన్ని వివరించింది. అక్కడ ఎవరూ ప్రధానమంత్రి అభ్యర్థి గురించి చర్చించలేదు. చివరికి మమతా బెనర్జీ కూడా.. ఈ విషయంపై… ఎలాంటి వివాదాస్పద ప్రకటనలు చేయలేదు. ఆమె గతంలో తాను ప్రధానమంత్రి అభ్యర్థినని ప్రకటించుకున్నారు. కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించడానికి కూడా కారణం అదే. తాను.. ప్రధాని రేసులో ఉన్నానని చెప్పడమే.
మద్దతివ్వాల్సిన పరిస్థితి వస్తే కాంగ్రెస్ ఎవరికి చాన్స్ ఇస్తుంది..?
ప్రాంతీయ పార్టీల తరపున మమతా బెనర్జీకి ఓ అడ్వాంటేజ్ ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎదురులేని శక్తిగా ఉంది. ఆ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లా.. 42 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు కాకుండా.. మరే ప్రాంతీయ పార్టీ కూడా.. 40 సీట్లలో పోటీ చేసేంత సామర్థ్యం లేదు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ సీట్ల సర్దుబాటు తర్వాత 38 స్థానాల్లోనే పోటీకి పరిమితం అవుతున్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ.. ఏ పార్టీ కూడా 40 సీట్లలో పోటీ చేసే పరిస్థితి లేదు. ఇక పోటీ చేయనప్పుడు.. అంత స్థాయిలో గెలుస్తారన్న నమ్మకం లేదు. కానీ మమతా బెనర్జీ మాత్రం బెంగాల్లో ఉన్న 42 సీట్లలో 40 గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అలా గెలిస్తే.. కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ రాకపోతే… ప్రధానమంత్రి అభ్యర్థిగా తనకు మద్దతిస్తారన్న విశ్వాసంతో ఆమె ఉన్నారు. కాంగ్రెస్‌తో కూటమిలో ఉన్నప్పటికీ.. రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించడానికి కొంత మంది సిద్ధంగా లేరు. మళ్లీ తమ తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలపడుతుందనేది ఆయా నేతల భావన. ఇలాంటి పరిస్థితుల్లో… కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే.. ఆ చాన్స్ తనకే రావాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. అందుకే.. విపక్ష పార్టీలన్నింటినీ ఆహ్వానించి తన బలప్రదర్శన చేశారు. వైసీపీ, టీఆర్ఎస్, బిజూ జనతాదళ్ మినహా.. దేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు.. సమావేశానికి హాజరయ్యాయి.
ప్రాంతీయ పార్టీల నేతలు “కాబోయే ప్రధాని”గా ప్రజల్లో ఇమేజ్ తెచ్చుకుంటున్నారా..?
మమతా బెనర్జీ .. కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అది బెంగాల్ ప్రజల మనసుల్లో తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రజెంట్ చేసుకోవడం. భారత దేశానికి ఇంత వరకూ బెంగాల్ నుంచి ప్రధాన మంత్రి అభ్యర్థి రాలేదు. గతంలో.. ప్రణబ్ ముఖర్జీ గట్టి ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేదు. ఇక వామపక్షాల నుంచి జ్యోతి బసు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పటికీ.. రాజకీయంగా వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాయి వామపక్షాలు. దాంతో.. బెంగాల్‌ను నుంచి ఇప్పటి వరకూ ఎవరూ ప్రధానమంత్రి కాలేదు. అందుకే.. ఇప్పుడు.. తనను ఆ స్థాయిలో ప్రజల ముందు ఉంచి.. తనను తాను బెంగాల్ ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రజెంట్ చేసుకుని… బెంగాల్లో ఉన్న పార్లమెంట్ సీట్లన్నింటినీ.. గెలుచుకోవడానికి మమతా బెనర్జీ ఈ సభను ఓ వేదికగా చేసుకున్నారు. మమతా బెనర్జీ ఎత్తుగడలో భాగంగానే సభ జరిగింది.
బీజేపీని ఓడించడానికి ఇలాంటి సభలు సరిపోతాయా..?
ఇప్పుడు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా.. తమ తమ రాష్ట్రాల్లో భారీ బహిరంగసభకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అమరావతిలో అందర్నీ పిలిచి బహిరంగసభ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా అదే చేయబోతున్నారు. అయితే ఈ బహిరంగసభల వల్ల బీజేపీని ఓడించలేరు. బీజేపీని ఓడించాలంటే.. ఇలా బీజేపీకి వ్యతిరేకంగా.. కూటమి కట్టిన పార్టీలన్నీ.. ఆయా రాష్ట్రాల్లో కలసి పోటీ చేయాలి. ఓట్లు చీలకుండా చూసుకోవాలి. కానీ చాలా రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదు. కొన్ని పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి. కొన్ని పార్టీలు దూరంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్ల బీజేపీ లాభపడుతుంది ఓడించాలంటే… అందరూ కలిసి పోటీ చేసి ఓట్లు చీలకుండా చూసుకోవాలి.