ఉపఎన్నికల ఫలితాలను పరిశీలన చేస్తే కొన్ని అంశాలు గుర్తించవచ్చు. ఒకటి ఉపఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు సంపూర్ణమైన విజయం సాధించడం. రెండు బీజేపీ సిట్టింగ్ సీట్లను కోల్పోవడం. సిట్టింగ స్థానాల్లో మరణించిన అభ్యర్థుల కుటుంబసభ్యులను నిలబెట్టినా.. సానుభూతి ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. మూడోది… భారీగా ఓట్ల తేడా ఉండటం. కైరానాలో 2014లో అన్ని పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినా.. బీజేపీకి వచ్చినన్నీ ఓట్లు రాలేదు. ఇప్పుడు అన్ని పార్టీలు కలసి పోటీ చేస్తే… బీజేపీ కనీసం లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయింది. నాలుగో అంశం ఏమిటంటే.. బీజేపీ మిత్రపక్షాలు దూరమైన చోట బీజేపీ ఓడిపోయింది. ఓవరాల్గా గత ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ మంచి ఫలితాలు సాధించిందో.. ఇప్పుడు అలాంటి చోట్ల బీజేపీ ఓడిపోయింది.
కైరానా పరాజయం బీజేపీకి ఆర్డీనరీ కాదు.. !
కైరానాలో ముస్లిం ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు. బీజేపీ అక్కడ మొదటి నుంచి హిందూ, ముస్లిం వివాదాలు సృష్టించి బలపడింది. 2014 లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపునకు కారణం అదే. ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కైరానా లోక్సభ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిని బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఓడిపోయింది. మతోన్మాదం వల్ల నష్టపోతున్నామని జాట్లు, ముస్లింలు గుర్తించారు. ఇది బీజేపీకి సాధారణ పరాజయం కాదు. బీజేపీ రాజకీయ ప్లాన్ అయిన హిందూ, ముస్లిం మధ్య విబేధాలను కూడా ప్రజలు తిరస్కరించారు. కైరానాలో గెలుపు కోసం బీజేపీ చాలా దిగజారింది. ఇలాంటి పరిస్థితే కొనసాగితే.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి కావడం అసాధ్యం.
విపక్షాల ఐక్యత కొనసాగుతుందా..?
విపక్షాల ఐక్యత ఉంటే బీజేపీని నిలువరిస్తారు. లేకపోతే బీజేపీకి లాభం కలుగుతుంది. దీనికి మహారాష్ట్రలోని పాల్ఘార్ లోక్సభ సీటు ఎన్నికే ఉదాహరణ. అక్కడ విపక్షాలన్నీ విడివిడిగా పోటీ చేయడం వల్ల బీజేపీ లాభపడింది. విజయం సాధించింది. గోండియా లోక్సభ సీటులో కాంగ్రెస్-ఎన్సీపీ కలసి పోటీ చేయడం వల్ల బీజేపీ ఓడిపోయింది. అంటే ఎక్కడైతే సమైక్యంగా ఉంటారో అక్కడ విపక్షాలు బీజేపీని ఓడించారు. ఈ పార్టీల మధ్య పొత్తులకు ఎలాంటి సిద్ధాంతం లేదని బీజేపీ విమర్శిస్తూంటుంది. కానీ బీజేపీ పెట్టుకునే పొత్తుల్లో ఏమైనా సిద్దాంతం ఉందా..? అంతా అవకాశవాదమే కదా..!. బీజేపీకి ఏమైనా సైద్ధాంతిక సౌలభ్యత ఉంది అంటే శివసేన. ఆ శివసేన కూడా.. ఇప్పుడు బీజేపీని దూరం పెడుతోంది. ఇప్పుడు రాజకీయ అవసరాలే పార్టీల పొత్తులకు మార్గదర్శకాలు. మోదీకి వ్యతిరేకంగా ఏకమవడం తప్పేం కాదు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు వ్యతిరేకంగా విపక్షాల్ననీ వ్యతిరేకమయ్యాయి. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి.
ఉపఎన్నికలు రిఫరెండం కాదు..!
మామూలుగా అయితే ఏ ఉపఎన్నిక రిఫరెండం లాంటిది కాదు. కానీ ఈ సారి ఉపఎన్నికలు దాదాపుగా ప్రతి కీలక రాష్ట్రంలోనూ జరిగాయి. పంజాబ్ నుంచి కర్ణాటక వరకూ ప్రజాభిప్రాయం వెల్లడయింది. గతంలో యూపీలో పశ్చిమ యూపీలోని గోరఖ్ పూర్, పుల్ఫూర్లో ఓడిపోతే.. ఇప్పుడు ఈశాన్య యూపీలోని… కైరానా లోక్సభలో సీటులో ఓడిపోయారు. రెండు ప్రాంతాలకు సామాజికంగా చాలా తేడా ఉంటుంది. రెండు చోట్లా బీజేపీ ఓడిపోయింది. అదే సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాది వరకూ.. జరిగిన అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయింది. 2014 తర్వాత ఏ ఉపఎన్నిక జరిగినా బీజేపీ ఓడిపోతూనే వస్తోంది. ఓవరాల్గా చూస్తే.. మోదీ బలహీనపడుతున్నారు. బీజేపీ బలహీనపడుతోంది.
మత రాజకీయాలు ఎప్పుడూ వర్కవుట్ కావు..!
మత రాజకీయాలు చేద్దామంటే ప్రజలు ఎల్లప్పుడూ చూస్తూ ఊరుకోరు. సంఘటితమవుతారు. ఏపీలో ప్రత్యేకహోదాపై రగడ జరుగుతూంటే.. బీజేపీ రమణదీక్షితులను రంగంలోకి దింపింది. చంద్రబాబు మీద బీజేపీ పోరాడాలంటే.. చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా.. శ్రీవారి మీద పడుతున్నారు. ఎందుకంటే ప్రజల మనోభావాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. కానీ ఇలాంటివి ఎల్లకాలం ఉపయోగపడవు.
జుమ్లాలు అంగీకరించడానికి ప్రజలు సిద్దంగా లేరు..!
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టింది. పెట్రోల్ ధర దగ్గర్నుంచి బ్లాక్ మనీ వరకు.. ప్రభుత్వం ప్రతీ విషయంలోనూ …. ఎన్నికల సమయంలో అనేక చెబుతాం..అన్నీ చేస్తామా.. అంటూ “జుమ్లా” కేటగిరిలో చేర్చేసింది. నిజానికి నరేంద్రమోదీని ఓట్లేసింది.. మతతత్వాన్ని చూసి కాదు.. ప్రజలకు ఇచ్చిన హామీలను చూసే. అవి నేరవర్చేడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది.
ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీనే..!
భారతీయ జనతాపార్టీ 282 సీట్లను గెలుచుకుని… పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కానీ 2014 నుంచి వరుసగా జరుగుతున్న ఉపఎన్నికల్లో ఓడిపోతూ రావడం వల్ల ఇప్పుడు మైనార్టీలోకి పడిపోయింది. ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీనే. కానీ పూర్తి మెజార్టీ ఉన్న పార్టీ కాదు. మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిందే.
మోదీ బలహీన పడితే ఉన్న పార్టీలూ వదిలేస్తాయ్..!
మోదీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. లక్ష్యం చేరుకోవడానికి తమ మధ్య సైద్ధాంతిక బంధాన్ని పెంచుకుటే.. ఐక్యత సుదీర్ఘ కాలం కొనసాగుతుంది. అదే సమయంలో మోదీ బలహీనపడుతున్నారని తెలిసినప్పటి నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు కూడా బయటపడతాయి. తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. శివసేన కూడా.. ఇక ఒంటరి పోరాటమేనని ప్రకటించింది. అకాలితళ్, జేడీయూ కూడా.. ఊగిసలాటలో ఉన్నాయి. ముందు ముందు మోదీ మిత్రపక్షాలు మరింత తగ్గిపోయే సూచనలు ఉన్నాయి.