“ఓటుకు నోటు కేసు”కు మూడేళ్లయింది. కేసు బయటకు వచ్చినప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చంద్రబాబును ఎవరూ రక్షించలేరని ప్రకటనలు చేశారు. కానీ ఆ తర్వాత ఏమయిందో కానీ ఎవరికీ తెలియదు. చంద్రబాబును ఎవరు రక్షించారో తెలియదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఈ ఓటుకు నోటు చాలా మార్పులు తీసుకొచ్చింది. ఈ కేసు తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండటానికి ఇష్టపడలేదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో ఇంకా తొమ్మిదేళ్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. చంద్రబాబు అమరావతికి వెళ్లిపోవడానికి మొగ్గు చూపారు. సరైన సౌకర్యాలు లేకపోయినా….ఉన్న పళంగా తాత్కాలిక భవనాలు నిర్మించుకుని అక్కడకు వెళ్లిపోయారు. అమరావతి సెంటిమెంట్‌ను దీనికి ఉపయోగించుకున్నారు.
తెలంగాణలో టీడీపీ స్ట్రాంగ్ బేస్..!
నిజానికి తెలంగాణలో తెలుగుదేశానికి మంచి ఆదరణ ఉంది. ఆధునిక హైదరాబద్‌ను నిర్మించిన నేతగా…. ఐటీ రంగాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన నేతగా చంద్రబాబుకు గుర్తింపు ఉంది. ఐటీ ఉద్యోగాలపై ఆధారపడిన లక్షలాది మధ్యతరగతి కుటుంబాలు.. టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. వీరే కాక.. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లాంటి జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రులకు కూడా టీడీపీపై అభిమానం ఉంది. అదే కాక.. పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి చారిత్రక నిర్ణయాలతో బీసీ వర్గాల్లోనూ టీడీపీకి ఆదరణ ఉంది. బలమైన స్థానిక నాయకత్వం, క్షేత్ర స్థాయిలో ఆదరణతో టీడీపీ బలంగానే ఉంది. కానీ రాష్ట్ర విభజన ప్రభావం తెలుగుదేశం పార్టీ పై బాగా పడింది.
తెలంగాణ రాజకీయాలను పట్టించుకోని చంద్రబాబు..!
విభజన చుట్టూ జరిగిన రాజకీయంలో తెలంగాణలో పూర్తిగా టార్గెట్ అయింది తెలుగుదేశమే. సీమాంధ్ర పార్టీగా టీడీపీని ప్రొజెక్ట్ చేశారు. అయినా అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పదిహేను అసెంబ్లీ సీట్లు, ఓ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోగలిగింది. అంటే.. ఆ పార్టీకి ఉన్న సంప్రదాయక బలమే కారణం. దీనికి తోడు చంద్రబాబు మొదట్లో తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబునాయుడు తన పాత్రను పూర్తిగా తగ్గించుకున్నారు. ఒక రకంగా ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించారని చెప్పవచ్చు. తెలంగాణ మహానాడులో చంద్రబాబు.. కేసీఆర్‌పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. అలాగే విజయవాడలో జరిగిన జాతీయ మహానాడులో.. తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్ పై విమర్శలు చేశారు కానీ..చంద్రబాబు మాత్రం ఏమీ అనలేదు.
ఒప్పందం ప్రకారమే తెలంగాణ రాజకీయాల నుంచి వైదొలిగారా…?
అంటే ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబునాయుడు.. తెలంగాణలో టీడీపీని ముందుండి నడిపించడానికి సిద్దపడలేదు. అలాగే… టీఆర్ఎస్తో ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్దంగా లేరు. ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న వివాదాల్లో కూడా గతంలో ఉన్నంత ఉద్రిక్తతలు లేవు. అంటే .. ఓటుకు నోటు కేసు విషయం లైట్ తీసుకుంటే.. తాను తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టనని చంద్రబాబు , కేసీఆర్ మధ్య ఒప్పందం జరిగిందా అన్నట్లుగా రాజకీయ పరిణామాలు జరిగాయి. అలాంటిదేమైనా ఉందా లేదా అని చెప్పలేము… కానీ రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం ఉందని నమ్మగలం. ఎందుకంటే.. ఓటుకు నోటు కేసు బయటకు రావడానికి ముందు చంద్రబాబు టీఆర్ఎస్ను టార్గెట్ చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్లో చేరుతున్నా.. ఆయన ఏమీ అనలేదు.
రాజకీయ లక్ష్యం నెరవేర్చుకున్న కేసీఆర్..!
ఈ ఓటుకు నోటు కేసు మూడేళ్లవుతున్నా.. టీఆర్ఎస్లో కూడా ఎలాంటి ప్రతిస్పందనలు లేవు. చంద్రబాబు ఓ వైపు ట్యాపింగ్ కేసును బయటకు తెచ్చారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో భాగంగా ఉంది. చంద్రబాబును కేసీఆర్ వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన కోరిక కాదు. కానీ టీడీపీని మాత్రం టార్గెట్ చేయాలి. తెలుగుదేశం పార్టీని తెలంగాణను దెబ్బకొడితేనే టీఆర్ఎస్ బలపడుతుంది. ఆ పార్టీ సంప్రదాయక ఓటర్లందరూ టీఆర్ఎస్ వైపుకి వస్తారు. ఇవన్నీ జరగాలంటే.. తెలంగాణలో టీడీపీ బలహీనపడాలి. చంద్రబాబు నాయుడు పార్టీని ముందుండి నడిపించకపోతే… చాలు టీడీపీ బలహీనపడుతుంది. అదే జరిగింది. అందుకే… ఓటుకు నోటు కేసు ఏమైనా కానీ… కేసీఆర్ రాజకీయ లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చిందనే చెప్పాలి. ఒక వేళ ఓటుకు నోటు కేసు కానీ బయటపడకపోతే.. చంద్రబాబు తెలంగాణలోనూ యాక్టివ్ గా ఉండేవారు.. తెలుగుదేశం పార్టీ కూడా బలంగానే ఉండేది.