ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. తాము ప్రజలకు నిజాలు చెప్పి.. వారి మద్దతు పొందుతామని.. ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రాష్ట్రాల్లలోలా..అధికారంలోకి వస్తామన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి 2014 తర్వాత భారతీయ జనత పార్టీ ఈశాన్య రాష్ట్రాలతో పాటు కొత్తగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ… ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యమా..?
అసోంలో గెలిచినట్లు ఏపీలో బలపడతారా..?
బీజేపీ నేతలు మాట్లాడితే.. అస్సాం, త్రిపుల గురించి చెబుతూ ఉంటారు. అక్కడ తమకు ఒక్క సీటూ లేకపోయిన ఐదేళ్లలో అధికారంలోకి వచ్చామని చెబుతూ ఉంటారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనూ అదే చెప్పారు. తీరా.. ఐదు నుంచి ఒక ఎమ్మెల్యే సీటుగా తగ్గిపోయారు. ఏపీ ఎన్నికల్లోనూ అదే మంత్రం వాడుతున్నారు. అస్సాంలోలాగో.. త్రిపురలోలాగే.. అధికారంలోకి వస్తామని చెప్పుకోవడం పగటి కలే. ఎందుకంటే.. అక్కడున్న పరిస్థితులు వేరు… ఇక్కడున్న పరిస్థితులు వేరు. అస్సాంలో… వలసదారులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పెద్ద ఉద్యమం నడిచింది. దానికి బీజేపీ మద్దతిచ్చింది. కొంత మంది బలమైన నేతల్ని పార్టీలో చేర్చుకుని బలపడింది. అలాగే.. అక్కడ సుదీర్ఘంగా ఓ ప్రభుత్వం ఉండటం… ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడంతోనే.. అక్కడ సాధ్యమయింది. కానీ.. ఏపీలో బీజేపీ ఏం చేసింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించింది. విభజన హమీలు అమలు చేయకుండా మోసం చేసింది. ఇన్ని మైనస్ లు పెట్టుకుని.. ఏపీని అస్సాం చేస్తామని.. ఉబలాటపడటం… రాజకీయ ప్రకటనలు చేయడానికే. ప్రత్యేకహోదా విషయంలో సెంటిమెంట్లను దెబ్బ తీశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల సెంటిమెంట్ ఆధారంగా బలపడింది.
మిత్రపక్షాలను మింగేసి ఇతర రాష్ట్రాల్లో బలపడిన బీజేపీ..!
ఇతర రాష్ట్రాల్లో.. బీజేపీ బలపడిందంటే.. దానికి కారణం… మిత్రపక్షాలు. దాదాపుగా బీజేపీ బలపడిన అన్ని రాష్ట్రాల్లో … మిత్రులతో కలిసి పోటీ చేసి.. బలం పెంచుకున్నారు. కానీ ఏపీలో ఆ పార్టీ వైపు… ఎవరూ చూడటం లేదు. టీడీపీ కటిఫ్ చెప్పిన తర్వాత బీజేపీని అందరూ అంటరాని పార్టీగాచూస్తున్నారు. జనసేన సహా ఎవరూ… బీజేపీకి ఆమడ దూరంలో ఉంటున్నారు. అసోంలో… మిత్రపక్షాల్ని కలుపుకుని వెళ్లారు. త్రిపురలో.. కాంగ్రెస్ వర్సెస్ సీపీఎం అన్నట్లుగా ఉన్న పరిస్థితిని… బీజేపీ వర్సెస్ సీపీఎం అన్నట్లుగా మార్చుకోగలిగారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలందర్నీ బీజేపీలో చేర్చుకున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీనే బీజేపీగా మారిపోయింది. ప్రత్యామ్నాయంగా మారింది. అలాగే… పలు రాష్ట్రాల్లో కొత్త నేతల్ని చేర్చుకుని బలపడ్డారు. అసోంలో.. ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ బీజేపీ నేత కాదు. అస్సాం గణ పరిషత్ నేత. ఆలాగే… దిగుమతి నేతల బలంతో… కలిసి బీజేపీ బలపడింది. ఏపీలో కూడా… కన్నాను చేర్చుకుని బలపడిపోదామని అనుకున్నారు. కానీ కన్నాకు .. పెద్దగా పలుకుబడి లేకపోవడంతో ప్రయోజనం లేకపోయింది.
చంద్రబాబును బలహీనం చేయడానికే మోడీ, షా ఏపీ టూర్లు.. !
కర్ణాటక నుంచి ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌లలో ఎలా అధికారాల్లోకి వచ్చారో.. అన్నీ చూశాం. ఆ ప్రయోగాలకు సంబంధించిన ఏ అంశమూ ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఏపీలో ఇప్పుడు టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు పోలరైజ్ అయిపోయాయి. మూడో శక్తిగా ఆవిర్భవించాలంటే.. జనసేన, వామపక్షాలకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఆ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతే కానీ.. బీజేపీ.. కనీసం..ఓ ప్రభావ శక్తిగా ఆవిర్భవించే అవకాశం కూడా లేదు. మోడీ, షాలు… సంప్రదాయ రాజకీయ నాయకులు కారు. వారు కిల్లర్ ఇన్స్టింక్ట్ రాజకీయాలు చేస్తారు. వెంట్రుకవాసి అవకాశం ఉందని తెలిసినా.. వచ్చేస్తారు. అవకాశం రాకపోతుందా.. అని ఆశతో దండయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు… వారు వస్తోంది.. బీజేపీని బలపరిచేద్దామని.. లేకపోతే.. గెలిచేద్దామని కాదు. చంద్రబాబును బలహీనం చేద్దామనే. మోడీ, అమిత్ షాలు నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తారు. అలాంటి దీర్ఘ కాలిక లక్ష్యాలతో… బీజేపీ అగ్రనేతలు ఏపీకి వస్తున్నారు.