జనసేన అధినేత పవన్ కల్యాణ్… చంద్రబాబు ఆడిస్తున్న యాక్టర్ అని.. వైసీపీ అధినేత జగన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ విమర్శల జోరు పెంచారు. జనసేన అభ్యర్థులను కూడా.. చంద్రబాబే ఖరారు చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. దీనిపై.. పవన్ కల్యాణ్ ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారు. పొత్తులు పెట్టుకోవాలంటే.. నేరుగానే పెట్టుకుంటానని… జగన్ చీకట్లోమోడీ కాళ్లు పట్టుకున్నట్లుగా పట్టుకోనని… విమర్శలు గుప్పించారు.
టీడీపీపై పవన్ విమర్శలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం లేదు..!
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారసభల్లో.. పూర్తిగా తనదైన బాణి వినిపిస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎంత తీవ్రంగా విమర్శిస్తారో… చంద్రబాబు, ప్రభుత్వంపైనా అదే తరహా విమర్శలు చేస్తున్నారు. లోకేష్‌పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. టీడీపీతో పొత్తు లేదని ప్రకటించి… కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి బరిలోకి దిగారు. ప్రచారసభల్లోనూ.. అదే చెబుతున్నారు. అయితే… మీడియా కవరేజీలో వస్తున్న సమస్య వల్ల.. పవన్ కల్యాణ్ చంద్రబాబును విమర్శించడం లేదనే భావన వస్తోంది. పవన్ కల్యాణ్.. జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వ్యాఖ్యలకు మీడియాకు అత్యధిక ప్రాధాన్యం లభిస్తోంది. అదే సమయంలో… చంద్రబాబుపై చేసే విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సాక్షి పత్రిక దీనికి భిన్నం. జగన్ ను విమర్శించే వాటిని పట్టించుకోదు.. కానీ..చంద్రబాబు విమర్శించే వాటికి ప్రాధాన్యం ఇస్తుంది. టీవీ మీడియా కూడా.. పవన్ కల్యాణ్.. జగన్ ను అన్న మాటలను పదే పదే ప్రసారం చేస్తోంది. టీడీపీకి సోషల్ మీడియా విభాగం సమర్థంగా ఉంటుంది. వారు .. ఈ విషయాలను మరింత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
జనసేన ఎవరి ఓట్లు చీల్చుకుంటుందో ఎవరూ చెప్పలేరు..!
పవన్ కల్యాణ్… కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి… వీలైనంతగా.. బలమైన అభ్యర్థులను బరిలోకి నిలిపారు. ఇది విశ్లేషించడానికి.. సుప్రసిద్ధులేమీ కావాల్సిన అవసరం లేదు. అటు టీడీపీని.. ఇటు వైసీపీని.. ఒకే విధంగా విమర్శిస్తున్నారు. అలాగే… రేపు.. జనసేన ఓట్ల వల్ల.. ఒక్క జగన్మోహన్ రెడ్డికే నష్టం జరుగుతుందా.. అన్న విషయాన్ని ఎవరమూ చెప్పలేము. పైగా… చంద్రబాబుకే నష్టం అన్న కోణం ఉంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. టీడీపీకి మద్దతు తెలిపారు. ఆయన మద్దతుదారుల ఓట్లన్నీ టీడీపీకి పడ్డాయి. ఇప్పుడు జనసేన నేరుగా పోటీ చేయడం వల్ల ఆ ఓట్లన్నీ.. జనసేనకే పడతాయి. అంటే టీడీపీకే మైనస్ అవుతాయి. ఇంకో థీయరీ ఏముంది.. జనసేన పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలిపోయి.. వైసీపీ నష్టపోతుందని చెబుతున్నారు. ఇది ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా.. మారుతుంది. జనసేన కొత్త పార్టీ.. ఆ పార్టీ తెచ్చుకునే ఓట్లు… ఇతర పార్టీల నుంచి రావాల్సి ఉంది. అందువల్ల జనసేన.. రెండు పార్టీల ఓట్లను… చీల్చుకోవచ్చు. ఎక్కడ ఎవరి ఓట్లు ఎక్కువ చీల్చుకుంటుందనేది కీలకం.
బీజేపీతో వైసీపీ మైత్రి లేదని ఎవరంటారు..? పవన్‌కి టీడీపీతో ఉందని ఎలా అంటారు..?
జనసేన పార్టీతో లోపాయికారీ పొత్తులే పెట్టుకుంటే.. టీడీపీ ఓట్లు చీలిపోతాయి కదా..! జనసేన ఎవరి ఓట్లు సాధిస్తుందనే దానిపై ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. వైసీపీ, బీజేపీ మధ్య.. ఉన్న సంబంధాలపై… అనేక విశ్లేషణలు వచ్చాయి. దానికి… అనేక సంఘటలను ఉదాహరణగా చెబుతాం. రాష్ట్రపతి, ఉపరాష్ట్ర పతి ఎన్నికల్లో వైసీపీ.. .బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. అలాగే.. బీజేపీకి చెందిన కేంద్రమంత్రులు, ఏపీ వ్యవహారాలను చూసేవారు కూడా.. వైసీపీ మాకు మిత్రపక్షమే అని చెబుతూంటారు. కానీ.. వైసీపీ నేతలు ఒక్క సారి కూడా ఖండించరు. ఇలాంటి కారణాల వల్ల రాజకీయ విశ్లేషకులు కూడా.. వైసీపీ, బీజేపీ మధ్య మైత్రీ ఉందని చెబుతూ ఉంటారు. బహిరంగంగా జరిగినప్పుడు చర్చిస్తారు. అందువల్ల ఇప్పుడు.. పవన్ కల్యాణ్.. రెండు పార్టీలకు వ్యతిరేకంగానే ఉన్నారు. టీడీపీతో ఉన్నారని చెప్పడం రాజకీయ ఆరోపణే.