మీకో చిన్న ఇల్లో.. పాలమో ఉంది. అన్ని పత్రాలు పక్కాగా ఉన్నాయి. హఠాత్తుగా ఎవడో… గ్రామ సచివాలయంలోనో… ఇంటి పన్ను పేపర్ లోనో.. మరో చోటనో.. తన పేరు రాయించుకుని.. ఆ ఇల్లు తనదే అని వస్తాడు. మీరు కంగారు పడిపోతారు. చివరికి అతను బెదిరింపులకు దిగుతాడు. ఎంతో కొంత ఇస్తా తనకు ఇచ్చేసి వెళ్లిపొమ్మంటాడు. మీకు న్యాయపోరాటం చేసే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి వివాదాలు కోర్టులకు అక్కర్లేదని అధికారులే పరిష్కరిస్తారని ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకు వచ్చేసింది. అసలు అధికారుల ప్రమేయం లేకుండా మీ ఆస్తి లో వేరే వారి పేరు చొప్పించిందే అధికారులు అయితే.. మళ్లీ వాళ్ల దగ్గరకు వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది ?. ఇచ్చింది తీసుకుని పోకపోతే.. మొత్తం అతనిదేనని రాసిచ్చేస్తామంటారు. ఇప్పుడు ఏపీలో అదే జరగబోతోంది. సైలెంట్ గా కొత్త చట్టం తీసుకు వచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓ కొత్త చట్టం సైలెంట్ గా అమల్లోకి వచ్చింది. దాని పేరు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం 2023. గుట్టుచప్పుడు కాకుండా అమల్లోకి తెచ్చేసింది. ఈ చట్టం ప్రకారం స్థిరాస్థి హక్కుల రిజిస్టర్ రూపొందిస్తారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకుగాను… ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైట్లింగ్ అధికారికే ఉంటుంది. ఆస్తి వారసత్వ సమాచారం, ఇంటిపై ఉన్న దావాలకు సంబంధించిన సమాచారం ఇలా మొత్తం వివరాలతో టైటిల్ రిజిస్ట్రీని నిర్వహిస్తారు. వినడానికి ఇక్కడ వరకూ కాస్త బాగానే ఉన్నా..అసలు ట్విస్ట్ వేరే ఉంది.
భూ హక్కుల చట్టం ప్రకారం… ఒకసారి రిజిస్టర్లో భూహక్కుదారుడి పేరు నమోదైన తర్వాత… ఆ భూములపై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్స్‌లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప కోర్టుకు వెళ్లడానికి లేదు. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్ తీర్పులపైనే హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో.. హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ను నియమించాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు ఫిటింగ్ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఏపీలో ప్రైవేటు ఆస్తుల రికార్డుల ట్యాంపరింగ్ పెద్ద ఎత్తున జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒంగోలులో ఓ మాఫియానే బయటపడింది. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు.ప్రజల ఆస్తుల్ని వివాదాల్లోకి నెట్టి.. వైసీపీ నేతలు పావలా, అర్థకు రాయించేసుకుంటున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆ మాఫియా ముఠాలకు సాయపడేలా ఈ చట్టం ఉండటంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.