మహానగరాల్లో ఇల్లు కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదు. తమ బడ్జెట్లో తమకు అనుకూలమైన ప్రదేశంలో ఇల్లు కొనుక్కోవాలంటే.. ఆ ఏరియాల్లో తిరగాలంటేనే.. చాలా కాలం పడుతుంది. కొంత మంది సంవత్సరం పాటు వెదికినా తమకు కావాల్సిన ఇళ్లు కనిపెట్టలేరు. ఇలాంటి వారందరికీ.. ప్రాపర్టీ షోలు మంచి వేదిక. హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల వివిధ సంస్థలు.. ప్రత్యేకంగా ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేస్తున్నాయి. దీని వల్ల ఎంతో మందికి అవగాహన పెరుగుతుంది. సమయం కలసి వస్తుంది.
ప్రాపర్టీ షోలలో గుర్తింపు పొందిన నిర్మాణ సంస్థలే పాల్గొంటాయి. అక్కడ ఇల్లు కొనేవారికి సంపూర్ణమైన అవగాహన కల్పించే స్టాల్స్ కూడా పెడతారు. చట్టాలు.. రెరా నిబంధనలు ఇలా ప్రతి విషయం తెలుసుకని తమకు అనుకూలమైన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో ఖరారు చేసుకుని .. వాటిని క్షేత్ర స్థాయిలో చూసి ఇల్లు కొనుగోలుకు నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇల్లు కొనేవాళ్లందరూ.. అన్ని సౌకర్యాలు ఉండే కాలనీల్లో కోరుకుంటున్నారు. ముఖ్యంగా అవి గేటెడ్ కమ్యూనిటీలు అయితేనే బెటరని అనుకుంటున్నారు.
ఇప్పటి వరకూ కాలనీల్లో గేట్లు మాత్రం ఉండవు కానీ పార్కులు.. ఇతర అవసరాలకు స్థలాలు కేటాయించాలి. కానీ చాలా కాలనీల్లో అన్నీ కబ్జాకు గురై ఉంటాయి. కానీ గేటెడ్ కమ్యూనిటీల్లో అలా ఉండదు. కబ్జాకు గురవడానికి అవకాశం ఉండకపోగా.. నిర్వహణ కూడా తమ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి కమ్యూనిటీల నిర్మాణం ఎక్కువగా ఉంది. వినియోగదారులూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల గురించి ప్రాపర్టీ షోల్లో ఎక్కువగా సమాచారం లభిస్తుంది.
ప్రత్యక్షంగా తిరిగి సమయం, ధనం వృధా చేసుకోవడం కన్నా… ప్రాపర్టీ షోలలో రెండు, మూడు గంటల సమయం కేటాయిస్తే.. ముందుగా మార్కెట్ పరిస్థితులు, ఇళ్ల ట్రెండ్ గురించి…. ఓ అవగాహన వస్తుందని అనుకోవచ్చు.