రాజశేఖర్ ఇంట్లో ఆనందోత్సహాలు వెల్లి విరిస్తున్నాయి. శుక్రవారం రాత్రంతా రాజశేఖర్ ఇంట్లో భారీ ఎత్తున పార్టీ జరుగుతూనే ఉంది. ఈలలు, గోలలు, కేరింతలతో ఆ ఇల్లు మార్మోగిపోయింది. లేక లేక.. రాక రాక హిట్ వచ్చిన ఆనందం అది. ‘రాజశేఖర్‌కి ఓ హిట్టొస్తే బాగుణ్ణు’ అనే ఫీలింగ్ అయితే ఈమధ్య సినీ జనాలకు కూడా వచ్చింది. ‘గరుడ వేగ’ ప్రెస్ మీట్లో రాజశేఖర్ కన్నీటి పర్యంతం అయ్యేసరికి అది మరింత ఎక్కువైంది. దాదాపు పాతిక కోట్లు పెట్టి తీసిన సినిమా… అటూ ఇటూ అయితే ఈ కుటుంబం ఏమైపోతుందో అనే బెంగ చాలామందికి ఉంది. అందుకే… ఓ పాజిటీవ్ దృక్పథంతో ఈసినిమా చూడ్డం మొదలెట్టారు. దానికి తగ్గట్టు సినిమా కూడా బాగుండడంతో… సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమాకి ప్రచారం మొదలైంది.
రివ్యూలు, రేటింగులు పాజిటీవ్ గా ఉండడం కలిసొచ్చింది. సింపతీ వర్కవుట్ అవ్వడం, సినిమా బాగుండడంతో మౌత్ టాక్ మెల్లమెల్లగా ఊపందుకొంటోంది. ఇదంతా వసూళ్లలోకి మారే ఛాన్సుందా?? రాజశేఖర్ ని చూడ్డానికి జనం థియేటర్ కి వస్తారా?? అనే విషయం పక్కన పెడితే.. సినీ పరిశ్రమ భాషలో, ట్రేడ్ వర్గాల లెక్కలో అప్పుడే ఈ సినిమాకి ‘హిట్’ టాక్ పడిపోయింది. వసూళ్లు కూడా పుంజుకొంటే.. సింపతీ అనేది జనాల్లో కూడా ఉన్నట్టే లెక్క. ఈ సినిమా బడ్జెట్ అదుపులోపెట్టుకొని, వీలైనంత తక్కువలో తీసుంటే బాగుణ్ణు అనే టాక్ వినిపిస్తోంది. రూ.25 కోట్ల సినిమా రూ.10 కోట్లతో ముగించి ఉంటే.. ఇప్పుడీ వసూళ్ల టెన్షన్ కూడా పెద్దగా ఉండేది కాదు.