పురందేశ్వరిపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విజయసాయిరెడ్డికి ఆమె షాకిచ్చారు. విజయసాయిరెడ్డి పదేళ్లు గా బెయిల్ పై ఉంటూ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తూ దారుణాలు, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన బెయిల్ రద్దు చేయాలని సీజేఐకి లేఖ రాశారు. పిటిషన్లో కీలకమైన అంశాలను ప్రస్తావించారు. దర్యాప్తును పదేళ్లుగా విజయసాయిరెడ్డి ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారు తక్కువ పదవుల్లో ఉన్నప్పుడే చేశారని ఇప్పుడు ఎక్కువ ప్రభావితమైన పదవుల్లో ఉన్నారని … అంతకు మించిన అవినీతి చేశారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీలో పెద్ద ఎత్తున మద్యం స్కాంకు పాల్పడ్డారని.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నది కూడా విజయసాయిరెడ్డి దగ్గర బంధువులేనన్నారు. విజయసాయిరెడ్డి బినామీల ద్వారా కొన్ని డిస్టిలరీలు నిర్వహిస్తున్నారని ఆధారాలను లేఖతో పాటు జత చేశారు. ఉత్తరాంధ్రకు ఇంచార్జ్ గా ఉంటూ.. పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. కుటుంబసభ్యుల పేర్లతో భూముల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబ్జా చేశారన్నారు.
విశాఖలో విజయసాయిరెడ్డి ప్రమేయం ఉన్న అనేక భూ దందాల గురించి సీజేఐకి రాసినలేఖలో పురందేశ్వరి వివరించారు. అధికారంతో వ్యవస్థలను నియంత్రిస్తున్నారని అందుకే వారి బెయిల్ ను రద్దు చేయాలని పురందేశ్వరి కోరారు. వైఎస్ వివేకా హత్య కేసునుతప్పుదోవ పట్టించే ప్రయత్నంలో కీలక వ్యక్తిగా విజయసాయిరెడ్డి ఉన్నారన్నారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడానికి సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకోవడమే కారణమన్నారు. ఇలా అన్ని విధాలుగా బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్న విజయసాయిరెడ్డి బెయిల్ ను తక్షణం రద్దు చేయాలని సీజేఐని.. పురందేశ్వరి కోరారు.