పూరి మ్యూజింగ్స్ పేరుతో పూరి జగన్నాథ్ కొన్ని ఆడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వివిధ అంశాలపై పూరి అభిప్రాయాలవి. సూటిగా, సుత్తిలేకుండా సాగిపోతున్నాయి. పూరి తత్వం, తన వ్యక్తిత్వం, పూరి ఇజం అన్నీ… ఆ మాటల్లో అర్థమవుతున్నాయి. ఆ మాటలకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. త్వరలోనే పూరి మ్యూజింగ్స్ పుస్తకంగానూ రాబోతోంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన`లోనూ ఇవే భావాలు కనిపించబోతున్నాయని టాక్. కథానాయకుడి పాత్ర కూడా అచ్చం పూరిలా మాట్లాడుతుందని, పూరి ఇజానికి హీరో క్యారెక్టర్ నిలువెత్తు నిదర్శనంలా కనిపించబోతోందని తెలుస్తోంది.
పూరి సినిమాల్లో పాత్రలన్నీ తింగరి తింగరిగా ప్రవర్తించినా ఓ ఫిలాసఫీ చెబుతుంటాయి. అదంతా పూరి ఇజమే. అయితే… ప్రతీ సినిమాలోనూ హీరోతో కొంత మాత్రమే మాట్లాడించాడు. `జనగణమన`లో మాత్రం… నూటికి నూరుపాళ్లూ ఆవిష్కరించబోతున్నాడట. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ సైనిక అధికారిగా కనిపించబోతున్నాడు. ప్రజాస్వామ్యం పనిచేయనప్పుడు మిలట్రీ రూల్ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ఈ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఒకే ఒక్కడులో ఒక రోజు సీఎమ్ కాన్సెప్ట్ లా.. `జనగణమన`లో చాలా వినూత్నమైన టాపిక్కుల్ని పూరి టచ్ చేయబోతున్నాడని, అందులో కొన్ని వివాదాస్పదమైన అంశాలూ ఉన్నాయని తెలుస్తోంది.