లైగర్‌తో పూరి జగన్నాథ్ బ్యాక్ స్టెప్ వేయాల్సివచ్చింది. విజయ్ తో అనుకొన్న జనగణమన ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. ఆ తరవాత.. పూరికి హీరో దొరకలేదు. చిరంజీవి, బాలకృష్ణ.. పేర్లు వినిపించినా, వాళ్లతో వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు విశ్వక్సేన్కి ఓ కథ చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. విశ్వక్ బాడీ లాంగ్వేజ్‌కీ, పూరి స్టైల్‌కీ తూకం వేసినట్టు సరిపోతుంది. పూరి హీరోకి కావల్సిన ఎనర్జీ విశ్వక్‌లో పుష్కలంగా ఉంది.కాబట్టి కాంబోతో క్రేజ్ వచ్చేసినట్టే. ఆగస్టు నుంచి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. దానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఈలోగా స్క్రిప్టుని పూర్తి స్థాయిలో సిద్ధం చేయబోతున్నాడు పూరి. విశ్వక్ కూడా.. `దాస్ కా దమ్కీ` తరవాత కాస్త బ్రేక్ తీసుకొన్నాడు. తన చేతిలోనూ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. ఆగస్టులోగా అవన్నీ ఓ కొలిక్కి వస్తాయని టాక్. ఇది కూడా ఇస్మార్ట్ శంకర్ లా.. కాస్త కొత్త నేపథ్యంలో సాగుతూనే, మాస్ మసాలా దినుసులు అన్నీ ఉన్న కథ అట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.