పూరి జగన్నాథ్ గట్స్ని మెచ్చుకోవాల్సిందే. మొన్నామధ్యే ‘మెహబూబా’ తీసి ఘోరంగా నష్టపోయాడు. ఆ అప్పులు తీర్చడానికి తన ఆస్తుల్ని అమ్ముకోవాల్సివచ్చింది. అన్ని నష్టాలు చూశాక ఎవరైనా సరే – కొంతకాలం కామ్ అయిపోతారు. సొంత సినిమాలు తీయకుండా, బయటి నిర్మాతల్ని పట్టుకుంటారు. కానీ పూరి అలా కాదు. లాభమో, నష్టమో తానే భరిద్దామని ధైర్యంగా అడుగు ముందుకేశాడు. పూరి దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా `ఇస్మార్ట్ శంకర్` మొదలైంది. దీనికి పూరినే నిర్మాత. ఈ సినిమా కోసం కూడా పూరి భారీగానే అప్పులు చేసినట్టు సమాచారం.
ఇప్పుడు తనయుడు సినిమా ‘రొమాంటిక్’ని పట్టాలెక్కించాడు. తనే కథ, మాటలు అందిస్తూ.. పెట్టుబడి కూడా పెడుతున్నాడు. ఇంత క్లిష్టతరుణంలో ఒక్క సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఒకేసారి రెండు సినిమాల్ని మొదలెట్టాడు. ఇదంతా పూరి మొండితనం కాకపోతే మరేంటి..?? పూరి తలచుకుంటే తనయుడు సినిమాని మరో నిర్మాతతో పట్టాలెక్కించొచ్చు. తక్కువ బడ్జెట్లో పనైపోతుంది కాబట్టి, పూరి బ్రాండ్ క కూడా తోడవుతుంది కాబట్టి, నిర్మాతలు కూడా రెడీగానే ఉంటారు. కానీ ఆ రిస్కేదో తానే తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు పూరి. నిజానికి మెహబూబా తరవాత ఆకాష్తోనే ఓ సినిమా ప్లాన్ చేశాడు పూరి. అనుకోకుండా.. రామ్ తో ప్రాజెక్టు ఓకే అయిపోవడంతో… ఆకాష్ సినిమాని పక్కన పెట్టాల్సివచ్చింది. ఎంతైనా తనయుడు కదా? తన కెరీర్ని నిలబెట్టాల్సిన బాధ్యత పూరిపై ఉంది. అందుకే.. తన సినిమాతో పాటు, తనయుడి సినిమానీ పట్టాలెక్కించేశాడు. ఈ రెండు సినిమాలైనా పూరిని అప్పుల బారీ నుంచి కాపాడితే అంతే చాలు.