కృష్ణజింకలను వేటాడిన కేసులో హిందీ హీరో సల్మాన్ ఖాన్‌కి జోధ్‌పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలుశిక్ష విధించిన విషయం విధితమే. దీనిపై తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ స్పందించిన తీరుపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, పూరి ఏమన్నారంటే… “గత 20 ఏళ్లలో మనదేశంలోని వేలాది కృష్ణజింకలను చంపేశారు. అది సమస్య కాదు. ఎవరూ మాట్లాడలేదు. ప్రతి రోజూ మనం ఆవులు, మేకలు, పందులను చంపేస్తున్నాం. వాటి ప్రాణాల గురించీ ఎవరూ మాట్లాడలేదు” అని. ఇందులో సల్మాన్ పేరు గాని… ఆయనకు విధించిన శిక్ష గురించి గాని… పూరి ఎక్కడా ప్రస్తావించలేదు. కాని సల్మాన్‌కి మద్దతుగా చేశారనేది క్లియర్.
మహేష్‌బాబు హీరోగా పూరి తీసిన ‘బిజినెస్‌మాన్’ సినిమాలో ఇంచుమించు ఇలాంటి డైలాగే వుంటుంది. “భూమ్మీద 600ల కోట్ల మనుషులు వున్నారు. అందులో సగంమంది ప్రతిరోజూ చేపలు పట్టుకుని తినేస్తున్నారు. ఎన్నో వేళా సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను చంపుకు తినేస్తే మేటర్ కాదు. ఎప్పుడైనా ఒక చేప గాని ఒక మనిషిని చంపి తినేస్తే గోల గోల చేస్తారు. ఒక చిన్న షార్ప్ పిల్ల బీచ్ లో ఎవరినైనా కొద్దిగా కొరికితే చాలు ప్రపంచంలో ఉన్న న్యూస్ చానెల్స్ అన్నిటిలో వేసేస్తారు. సినిమాలు తీసేస్తారు” అని. పూరి చెప్పే ఫిలాసఫీలు ఈవిధంగానే వుంటాయి. సినిమాల్లో వాటిని ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు నిజ జీవితంలో ఎంజాయ్ చేయడం లేదు. సల్మాన్‌కి మద్దతుగా చేసిన ట్వీట్ మీద మండిపడుతున్నారు.
“సిగ్గు పడండి సార్… ఐదు కోట్ల తెలుగు ప్రజలకు అన్యాయం జరిగితే ఒక్క ట్వీట్ లేదు. ఇండస్ట్రీలో ఒక క్రిమినల్ని లోపాలకి వేయగానే బయటకు వచ్చారు. షేమ్” అని ఒకరు ఆయన ట్వీట్‌కి రిప్లై ఇస్తే… “ఎంతో మంది ప్రజలు కూడా చంపబడుతున్నారు. అలాగని, ఒక సెలబ్రిటీ ఎవరినైనా చంపేస్తే అతణ్ణి వదిలేయాలా?” అని మరొకరు… పూరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.