నయీంను ఎన్ కౌంటర్ చేసినా ఆయన ముఠాతో ఆర్.కృష్ణయ్య చేస్తున్న దందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా తెలంగాణకు చెందిన ఏపీలోరాజ్యసభ సీటు తెచ్చుకున్నారు. అలాంటిది పోలీసు కేసులు ఎలా నమోదు చేయగలరు. బాధితుడు కోర్టుకెళ్లిఆధారాలు సమర్పించి కేసు నమోదుచే సేలా ఆదేశాలు తెచ్చుకున్నారు. హైదరాబాద్కు చెందిన రవీందర్ రెడ్డి తన భూమిని కబ్జా చేశాడని.. నయీం ముఠాతో చంపుతానని బెదిరిస్తున్నాడని కోర్టులో కేసు దాఖలు చేశాడు. పిటిషన్ను విచారించిన కోర్టు జారీ చేసిన ఆదేశాలతో హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆర్.కృష్ణయ్యతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు.
రాయదుర్గం పరిధిలో రవీందర్ రెడ్డికి భూమి ఉంది. తన భూమిని ఆర్.కృష్ణయ్య కబ్జా చేశారని రవీందర్ రెడ్డి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. తన భూమిని కబ్జా చేయడంతో పాటుగా తనను చంపేందుకు కూడా కృష్ణయ్య యత్నించారని కొందరు రౌడీలను పంపి తనను బెదిరిస్తున్నారని ఆయన ఆర్.కృష్ణయ్యపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఆధారంగా ఆర్.కృష్ణయ్య సహా మరికొందరిపై రాయదుర్గం పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఐపీసీ సెక్షన్లు 447, 427, 506, 384, రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారంతో గడువు ముగియనుంది. మొత్తం 4 స్థానాలకు 4 నామినేషన్లే వచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య సహా వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలున్నాయి. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతున్న రోజునే నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. నయీం ముఠాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనపై కేసు నమోదుకావడంతో అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే కోర్టు ఆదేశాలతోనే కేసు నమోదుచేశారు.. దీనిపై పోలీసులు ఎంత దూకుడుగా చర్యలు తీసుకుంటారన్నదానిపైనే ఇతర విషయాలు ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.