రెండున్నరేళ్లు ముగిసే సరికి మంత్రులందర్నీ తొలగించి కొత్త వారికి చాన్సివ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లుగా వైసీపీలోప్రచారం జరుగుతోంది. కానీ ఆయన అలా చేయలేరని బయట నుంచి కొంత మంది సవాళ్లు చేస్తున్నారు. ఎందుకంటే జగన్‌ను మించిన సీనియర్లు కేబినెట్లో ఉన్నారని.. వారిని తీసేసే ధైర్యం జగన్‌కు లేదంటున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇదే అంటున్నారు.
ప్రస్తుత మంత్రివర్గంలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి హేమాహేమీలున్నారని వారిని తొలగించడం జగన్ వల్ల కాదన్నారు. ఒక వేళ వారిని తీసేస్తే రాజకీయం జగన్‌కు అంతసులువుగా ఉండదని హెచ్చరించారు. నిజానికి జగన్ వారిని తొలగించడానికే మొత్తం కేబినెట్‌ను జగన్ ప్రక్షాళన చేస్తారన్న అభిప్రాయం వైసీపీలో ఉంది. సీనియర్ మోస్ట్లయిన ఆ ఇద్దరూ తమకు లభిస్తున్న గౌరవం పట్ల అంత సంతృప్తిగా లేరు.
పేరుకే పదవులు కానీ ఖర్చయ్యే బాధ్యతలు మాత్రమే తమకు అప్పగిస్తున్నారని ఇక ఏ అధికారాలు లభించడం లేదని అసంతృప్తిలో ఉన్నారు. పనిలో పనిగా వీరు తమ సొంత ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారన్న రూమర్స్ వైసీపీలో ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని మరింత రెచ్చగొట్టేందుకు రఘురామ కేబినెట్ ప్రక్షాళనఫై మాట్లాడుతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.