సినిమా టిక్కెట్లను తామే అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంపై టాలీవుడ్ పెద్దలు ఇంత వరకూ స్పందించలేదు. ఈ అంశంపై చిరంజీవిస్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ సూచించారు. దశాబ్దాలుగా ఉన్న పరిశ్రమను కూలదోసే ప్రయత్నం జరుగుతోందని.. టిక్కెట్ రేట్లను తగ్గించారన్న విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. లాభాల్లో ఉన్న గంగవరం పోర్టును నిర్వహించకుండా అమ్మేసి ప్రైవేటు వ్యాపారం అయిన సినిమా టిక్కెట్లు అమ్ముతామనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మటన్ మార్ట్లు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపైనా ఆయన సెటైర్లు వేశారు.
ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్లో ఎవరూ పెద్దగా స్పందించడంలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా ఎవరూ తమ అభిప్రాయం చెప్పడానికి సిద్ధపడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో టాలీవుడ్ ప్రముఖులకు సన్నిహిత సంబంధాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గతంలో రెండు సార్లు తాడేపల్లి వెళ్లి భేటీ అయ్యారు కూడా. ఇక నాగార్జునకు జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం బహిరంగం. ఇక టాలీవుడ్‌కు మరో పిల్లర్ లాంటి మోహన్ బాబు నేరుగా అధికార పార్టీ సభ్యుడు. టీడీపీతో సంబంధం ఉన్న కొద్ది మంది మినహా మిగిలిన అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడితే తమ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లవుతుందేమోనని వారు సైలెంట్‌గా ఉన్నారేమోనన్న అభిప్రాయం వినిపిస్తోంది. లేకపోతే ప్రభుత్వ పోర్టల్ వల్ల ఇండస్ట్రీకి మేలు జరుగుతుందన్న అంచనాకూ వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే అదే నిజం అయితే ప్రభుత్వంపై ప్రశంసలు జల్లు కురిపించడానికి ఎప్పుడూ మొహమాటపడని సినీ పెద్దలు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటారన్న సందేహం వస్తుంది.