పారిశ్రామిక వేత్త రఘురామ కృష్ణంరాజు మళ్లీ వైఎస్ఆర్ సీపీలోకి అధికారికంగా చేరిపోయారు. పార్టీ ఫిరాయించే అందరు రాజకీయ నాయకుల్లాగానే ఈయన కూడా, రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్సార్ సీపీలో చేరానని, అభివృద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యం అని భావించి పార్టీ మారానని చెప్పుకొచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు ఇలా వైఎస్సార్సీపీలో చేరారో లేదో, గతంలో ఆయన జగన్ మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ గా మారాయి.
రఘు రామ కృష్ణంరాజు గతంలో వైఎస్ఆర్సిపి లోనే ఉన్నారు. అక్కడి నుండి టీడీపీకి వచ్చారు. ఇప్పుడు టిడిపి నుండి మళ్లీ వైఎస్ఆర్ సీపీలోకి వెళ్లారు. అయితే వైఎస్ఆర్సిపి నుండి టీడీపీలోకి వచ్చిన కొత్తలో ఆయన “ఓపెన్ హార్ట్” ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మాట్లాడుతూ, జగన్ కి అపరిచితుడు సినిమాలోని విక్రమ్ పాత్రకి చాలా పోలికలు ఉన్నాయని, అందులో రామానుజం ఎలాగైతే చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఉంటాడో, జగన్ కూడా ప్రజల్లోకి వచ్చి నప్పుడు అలా రామానుజం పాత్రలాగా మంచిగా, సాఫ్ట్ గా ఉంటాడని అన్నారు. అయితే, అపరిచితడు లో విక్రమ్ తన మరొక రూపంలో ఎలాగైతే అపరిచితుడు గా భయంకరంగా ఉంటాడో , అలా జగన్ కూడా తన పార్టీలోని ఇతరులతో వ్యవహరించేటప్పుడు మరొక రకంగా ప్రవర్తిస్తాడని వ్యాఖ్యానించారు. జగన్ ని ఒక సైకో లాగా ముద్రవేసే ప్రయత్నం ఆ ఇంటర్వ్యూలో రఘురామకృష్ణంరాజు చేశారు.
అయితే రఘురామకృష్ణంరాజు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అప్పుడు అన్నేసి వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు ఇప్పుడు ఎందుకని మళ్లీ జగన్ దగ్గరికి వెళ్తున్నారని నెటిజన్లు ఆయన్ను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సిపి అభిమానులు మాత్రం, జగన్ గెలుస్తాడని అందరికీ అర్థమైంది కాబట్టే, అందరూ తిరిగి జగన్ వద్దకు చేరుతున్నారని సంతోష పడుతున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ సీపీకి, వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీకి, ఇప్పుడు టిడిపి నుండి వైఎస్ఆర్సిపి కి చేరిన రఘురామ కృష్ణంరాజు ఈసారైనా రాజకీయాల్లో తను అనుకున్నది సాధిస్తాడా అన్నది వేచి చూడాలి.