తెలంగాణలో జరుగుతున్న ఏకైక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు సెంటర్ పాయింట్ అవుతున్నారు. అధికార పార్టీ ఆయననే చాలా సూటిగా గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఎన్నికల కోసం ఆయనకు ఏ మాత్రం ఆర్థిక సహకారం లేకుండా చేసేందుకు యంత్రాంగం మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నట్లుగా కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలే నిరూపిస్తున్నాయంటున్నారు. ఎన్నికల తేదీల ప్రకటన దగ్గర్నుంచి వరుసగా ఆయనకు సంబంధించిన డబ్బులు పట్టుబడుతున్నాయి. అందరూ.. ఎన్నికల్లో పంచేందుకు తీసుకెళ్తున్నామని ఒప్పుకుంటున్నారని.. పోలీసులు కూడా స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో హైదరాబాద్ శివారులో రూ. 40 లక్షల వరకూ పట్టుకున్నారు. దొరికిన వారు రఘునందన్ రావు ఆఫీసు సిబ్బంది. వారు ఎన్నికల్లో పంచడానికి తీసుకెళ్తున్నట్లుగా అంగీకరించారని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత సిద్దిపేటలోని రఘునందన్ రావు బంధువు అంజన్ రావు ఇంట్లో కూడా నగదు పట్టుబడింది. అది పెద్ద రచ్చ అయిపోయింది. ఇప్పుడు తాజాగా.. రఘునందన్ రావు బామ్మర్ది రూ. కోటి నగదును తీసుకెళ్తూండగా పోలీసులు పట్టుకున్నారు. అది కూడా ఎన్నికల్లో పంచడానికేనని.. పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఎన్నికలంటే.. కోట్ల ఖర్చుతో కూడుకున్నవి. ఏ అభ్యర్థి అయినా నిబంధనల ప్రకారం.. స్వల్పంగానే ఖర్చు పెట్టానంటే అతి అతిశయోక్తే.
ప్రస్తుతం దుబ్బాకలో అన్ని రాజకీయ పార్టీలు డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. మూడో తేదీన పోలింగ్ జరగనుంది కాబట్టి.. ఇక నేరుగా ఓటర్లకు పంచే కార్యక్రమం ఉంటుంది. అందు కోసం… ఒక్కో పార్టీ రూ. 20, 30 కోట్ల వరకూ రెడీ చేసుకుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సహజంగా అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ వేరుగా ఉంటుంది. యథేచ్చగా డబ్బులు తరలించినా ఎవరూ పట్టించుకోరు.. పంచినా… పట్టించుకోరు. ఆ అడ్వాంటేజ్‌తో అధికార పార్టీ వి ఒక్క రూపాయి కూడా వెలుగులోకి రాలేదు. విశేషం ఏమిటంటే.. టీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు చేసినా కూడా.. ఒక్క రూపాయి కూడా దొరకలేదని పోలీసులు ప్రకటించారు. కాంగ్రెస్ నేతల్ని అసలు పట్టించుకోవడమే మానేశారు.