కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతిలో సభ నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో ఇదే తిరుపతి నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ప్రచారానికి వచ్చి, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు రాహుల్ కూడా తిరుపతి నుంచే హోదా హామీని మరోసారి ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ప్రకటిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ సర్కారుపై కొన్ని విమర్శలు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటనేది కూడా రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చేశారనే చెప్పొచ్చు. పొత్తుల విషయంలో ఈ మధ్య నెలకొన్న కొంత గందరగోళానికి దాదాపు తెరపడ్డట్టే అనొచ్చు.
రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కేంద్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే హోదా ఇస్తామనీ, దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా కూడా కేంద్రంలో తాము ఉంటాం కాబట్టి, హోదా కచ్చితంగా వస్తుందనీ, దీని గురించి ఎవ్వరూ ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ పాత్ర ఏంటనేది రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పేసినట్టే కదా! ‘రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్ అధికారంలోకి రాకున్నా’… ఇలా రెండుసార్లు రాహుల్ అన్నారు. అంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితి ఏంటనేది రాహుల్ చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో అనూహ్యంగా ఏదో సాధిస్తామనే భ్రమ రాహుల్ కి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని బరిలోకి దించినా, అది నామమాత్రమే అనేది ఆయనే చెబుతున్నట్టుగా ఉంది.
దీంతో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య అవగాహన ఏమీ లేదని… ఎవరిదారులు వారివే అనేది రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలను ఎన్నికల తరువాతి అంశంగా రాహుల్ భావిస్తున్నట్టున్నారు. ఏపీ నుంచి ఏదో ఒక పార్టీ మద్దతు లభిస్తే తప్ప ప్రత్యేక హోదా ఇస్తామనే ధోరణిలో కాంగ్రెస్ లేదు. నిజానికి, నిన్ననే… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పొత్తులపై మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే మద్దతు ఇస్తారో, వారే మన మిత్రులు అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. అంటే, టీడీపీ కాంగ్రెస్ ల మధ్య పొత్తు అనేది ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలూ ప్రత్యేకంగా పరిగణిస్తున్న పరిస్థితి లేదనే అభిప్రాయం కల్పించే ప్రయత్నం రెండు వైపుల నుంచీ జరిగిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు ఫరక్ పడదు అన్నట్టుగా రాహుల్ కూడా స్పష్టం చేయడంతో… అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాత్ర కూడా స్పష్టమైపోయింది.