తెలంగాణ పర్యటనకు రాహుల్ గాంధీ రానని చెప్పారా…? సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వెళ్లి మరీ ఆహ్వానించినా… రాహుల్ రాకపోవటానికి కారణం ఏంటీ? తెలంగాణ నుండి రాహుల్ గాంధీకి సొంత టీం ద్వారా నివేదికలు అందుతున్నాయా?
ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ కాంగ్రెస్ ను వేధిస్తున్నాయి. రైతు రుణమాఫీని ఏకకాలంలో చేశాం, రాహుల్ గాంధీ ఇచ్చిన ఎన్నికల హమీ నెరవేర్చాం కాబట్టి హామీ ఇచ్చిన వరంగల్ మైదానంలోనే కృతజ్ఞత సభ పెడతాం అని ప్రకటించిన సీఎం… రాహుల్ గాంధీని మాత్రం రప్పించుకోలేకపోతున్నారు.
నిజానికి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభకే రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీని ఆహ్వానించారు. కానీ అప్పుడు బిజీ షెడ్యూల్ ఉందని వారు రాలేదు. కానీ, 31వేల కోట్ల రుణమాఫీని ఏకకాలంలో చేసి చూపించాం… అందుకు రైతు కృతజ్ఞత సభ పెట్టి రాహుల్ ను అభినందిస్తాం అని ప్రకటించారు. ఆగస్టు నెలాఖరులో సభ ఉంటుందని కాంగ్రెస్ ప్రకటించుకుంది. కానీ, రాహుల్ గాంధీ మాత్రం రావటం లేదు. కనీసం సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే అవకాశం కూడా పెద్దగా కనిపించటం లేదు.
రాహుల్ రాకపోవటానికి తెలంగాణలో రుణమాఫీపై ఉన్న భిన్న వాదనలే కారణం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. రుణమాఫీ పూర్తి కాలేదని, ఇంకా చాలా మంది రైతులకు అందలేదని ప్రభుత్వ వర్గాలే పూటకో లెక్క చెప్తున్నాయి. రోజుకో మంత్రి పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొనే బీఆర్ఎస్ విమర్శలు చేయటంతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. దీంతో రాహుల్ గాంధీ వెళ్లి అనవసరంగా విమర్శలు ఎదుర్కోవటం కన్నా దూరంగా ఉండటమే బెటర్ అని నిర్ణయించుకోవచ్చు అని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. రాహుల్ టూర్ కన్ఫామ్ అయితే ఇప్పటికే తెలిసిపోయేదని, ఆయనకు కూడా రాష్ట్రం నుండి వాట్ ఈజ్ వాట్ అన్న నివేదికలు అందుతాయి కదా అంటూ కాంగ్రెస్ లీడర్లు కామెంట్ చేస్తున్నారు.