కాంగ్రెస్ పార్టీలో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీని వెనక్కి తగ్గించేందుకు ఎంతమంది ప్రయత్నిస్తున్నా ఆయన తగ్గడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు రెండే రెండు దారులు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మొదటిది… అందరూ కలిసి రాహుల్ నాయకత్వాన్ని కొనసాగించాల్సిందిగా స్పష్టమైన నిర్ణయం తీసుకుని, ఆయన వెనక సాగడం. రెండోది… అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ కి కొంత ఉపశమనం ఇస్తూ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి ఒక పదవిని సృష్టించడం, కొందరు నాయకులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం. రెండో ప్రతిపాదనపై మీడియాలో చర్చ జరుగుతున్నా… ఇది కాస్త కష్టసాధ్యమైందిగానే చెప్పాలి. ఎందుకంటే, పార్టీ నాయకత్వ పగ్గాలు గాంధీయేతర కుటుంబానికి చెందినవారికి ఇస్తే… వర్కింగ్ ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న నాయకుడి నాయకత్వంలో కాంగ్రెస్ వరుస విజయాలు సాధిస్తే… కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర మరింత ప్రశ్నార్థకరమైపోతుంది కదా!
గాంధీ కుటుంబమే ఎందుకూ… ఎవరైనా బాధ్యతలు తీసుకోవచ్చు కదా అనేదే రాహుల్ అభిప్రాయం కూడా. కానీ, పార్టీ భవిష్యత్తు దృష్ట్యా ఆలోచిస్తే… అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసినట్టే అవుతుంది. వాస్తవం మాట్లాడుకుంటే… కాంగ్రెస్ పార్టీకి రాహుల్ ఓరకంగా బలం. ఎలా అంటే.. వారసత్వపరంగా! గాంధీ కుటుంబానికి చెందిన నాయకుడిగా రాహుల్ కి ఉన్న ఆ సమ్మోహన శక్తి ఇతరులకు రాదు. కాంగ్రెస్ లో ఆ తరహా గుర్తింపు ఇతర నాయకులకు లేదు. ప్రస్తుత పరిస్థితిలో గాంధీయేతర కుటుంబానికి చెందిన నాయకుడే పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఉంటే… రాజీనామా చేశాయాలని ఇప్పటికే పార్టీ వర్గాలు బహిరంగంగా కోరేవి. కాబట్టి, వారసత్వం దృష్ట్యా చూసుకుంటే రాహుల్ ఎప్పటికీ కాంగ్రెస్ కి బలమే అవుతారు.
ఇక, కాంగ్రెస్ కి రాహులే బలహీనత అని ఎందుకు అనాలంటే… పార్టీ అత్యంత సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు, నాయకుడిగా మరింత బాధ్యతను నెత్తినేసుకోవాలి. అంతేగానీ, బాధ్యతల నుంచి తప్పుకోవడమే పార్టీ బలోపేతానికి పనికొచ్చే చర్యగా ఒక నాయకుడు అనుకోకూడదు. ఇలాంటి సమయంలో పార్టీ నాయకులకు అధ్యక్షుడు మరింత చేరువగా ఉండాలి. వారిని పిలిచి… తన సారథ్య లోపాలేంటనేవి ఓపెన్ గా అడిగి తెలుసుకోగలగాలి. ఆ ప్రయత్నం రాహుల్ చేయడం లేదు. పార్టీ ఓటమి పాలయ్యాక… ప్రతిపక్షంగా ధీటుగా ఉంటామనే సంకేతాలు రాహుల్ ప్రజలకు ఇవ్వడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాటి నుంచీ.. నేను తప్పుకుంటా తప్పుకుంటా అని మాత్రమే అంటున్నారు. గడచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ లో ఇదే చర్చ జరుగుతోంది. దీని వల్ల పార్టీకి నష్టమేగానీ లాభం లేదు. ఈ రకంగా కాంగ్రెస్ కి రాహుల్ ప్రస్తుతం ఒక బలహీనతగా కూడా కనిపిస్తున్నారు.