రాహుల్ గాంధీ ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకునేందుకు సిద్దంగా లేరు. పార్టీలో సీనియర్ల తీరుపై తీవ్ర అసంతృప్తితో గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎవరు.. ఎన్ని సార్లు చెప్పినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. చివరికి సోనియానే తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి బండి నడిపిస్తున్నారు. శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో కూడా రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా ప్రకటించే నిర్ణయం తీసుకుంటారని అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు.
దీంతో సోనియా గాంధీనే తాను తాత్కాలికం కాదని.. స్పష్టం చేసి.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నేతలకు వార్నింగ్ ఇచ్చారు. మీడియాతో ఎవరూ మాట్లాడవద్దన్నారు. జీ -23 పేరుతో ప్రత్యక్ష ఎన్నికల్లో పెద్దగా పాల్గొనకుండా పార్టీలో పలుకుబడి సాధించిన నేతలు… కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై రచ్చ చేస్తున్నారు. వీరిని ఉద్దేశించే సోనియా వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీ అసంతృప్తి కూడా వారిపైనే. వారు మారడంలేదు.. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేరు. అయితే.. 90శాతం మంతి కాంగ్రెస్ క్యాడర్‌తో పాటు అన్ని స్థాయిల నేతల్లోనూ రాహుల్‌కు సానుకూలత ఉంది.
ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించాలనే డిమాండ్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తోంది. నిజానికి అనారోగ్యం వల్ల సోనియా పార్టీ కి అధ్యక్షురాలిగా ఉన్నా.. అత్యంత క్లిష్టమైన విషయాల్లో మాత్రమే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిగతా అన్నీ రాహులే చూసుకుంటున్నారు. ఓ రకంగా వర్కింగ్ ప్రెసిడెండ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించడానికి ఆయనకూడా సిద్ధంగా లేరు. అందుకే ఆలస్యం అవుతోంది.