హర్యానా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోన్న సమయంలో భారత రెజర్లు వినేశ్ ఫొగాట్ , బజ్ రంగ్ పునియాలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ లో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ రాహుల్ తో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్లు అయింది.
బుధవారం ఉదయం రెజ్లర్లు వినేశ్ ఫొగాట్ , బజ్ రంగ్ పునియాలు రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీరు రాహుల్ తో ఎందుకు భేటీ అయ్యారు అనేది స్పష్టత లేకపోయినా..ఈ సమావేశం ద్వారా వినేశ్ ఫొగాట్ తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై ఓ అంచనాకు రావొచ్చుననే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇటీవల ఒలంపిక్స్ ముగించుకొని స్వదేశానికి చేరుకున్న ఫొగాట్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అదే సమయంలో ఆమె కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. హర్యానాకు చెందిన వినేశ్ ఫొగాట్ మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాలని అధిష్టానం భావిస్తోందన్న ప్రచారం ఇటీవల మరింత ఎక్కువైంది.
ఇప్పటికే హర్యానా ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైకమాండ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు చేస్తోంది. నేడో , రేపో అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్దం అవుతుండగా.. రాహుల్ తో వీరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
ఇక, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వినేష్ ఫొగాట్ సోదరి బీజేపీలో చేరి దాద్రి నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. మరోసారి ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వనుందని.. దాంతో ఆమె సోదరిపై వినేశ్ ను బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.