ఐదేళ్ల క్రితం.. అప్పట్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్రమోడీ.. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని ప్రకటించారు. ఆయన హావభావాలు, బాడీలాంగ్వేజ్ చూస్తే… మోడీ రావడం ఆలస్యం.. ప్రత్యేకహోదా వచ్చి పడుతుందని సగటు ఆంధ్రుడు అనుకుంటారు. ఈ సారి మరో ప్రధాని అభ్యర్థి వచ్చారు. ఆయన కూడా అదే హామీ ఇచ్చారు. ఆయన కూడా అదే తరహాలో బల్లగుద్ది మరీ… హోదా ఇచ్చి తీరుతామని చెప్పారు.
తిరుపతిలో హామీ ఇచ్చి మర్చిపోయిన మోడీ…!
2014 ఎన్నికల ప్రచారం కోసం… ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చిన ప్రధాని అభ్యర్థి హోదాలో .. మోదీ ఇచ్చిన హామీ ఇది. వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని… నిలబెట్టుకోవడంలో… మోదీ విఫలమయ్యారు. అంతే కాదు.. ప్రదానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క సారి కూడా.. ఆయన నోటి వెంట.. ప్రత్యేకహోదా అన్న మాట రాలేదు. మళ్లీ ఎన్నికల ప్రచారం కోసం.. ఏపీకి కొద్ది రోజుల కిందట వచ్చిన ఆయన… గతంలో ప్రత్యేకహోదా ఇస్తామనే ప్రధాన అజెండాతో పొత్తు పెట్టుకున్న టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రిపై… వ్యక్తిగత విమర్శలు చేసి.. వెళ్లిపోయారు. హోదా మాట మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు అదే మైదానంలో.. ఐదేళ్ల తర్వాత మరోసారి ప్రత్యేకహోదా హామీ మార్మోగింది. అప్పట్లో… బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోదీ అయితే.. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ.
ఇప్పుడు అదే వేదికపై రాహుల్ హోదా హామీ..!
నిజానికి పార్లమెంట్ లో ప్రత్యేకహోదా హామీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. కానీ.. అలా ప్రకటించేలా.. తీవ్రంగా ఒత్తిడి చేసింది బీజేపీ. అప్పటి వరకూ ప్రత్యేకహోదా అన్న అంశం ఒకటి ఉందని.. పెద్దగా ఎవరికీ తెలియని సమయంలో.. అప్పట్లో బీజేపీ కీలక నేతగా ఉన్న వెంకయ్యనాయుడు ఈ డిమాండ్ చేశారు. పదేళ్లు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. మన్మోహన్ సింగ్ ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తూ ప్రకటన చేశారు. కానీ.. ఆ ప్రత్యేకహోదాను చట్టంలో పెట్టాలంటే.. మళ్లీ లోక్ సభ అనుమతి పొందాలి. అప్పటి పరిస్థితుల్లో అలా చేయడం సాధ్యం కాదని అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చి.. ఎవరైనా.. అధికారంలోకి వచ్చేది ..తామే కదా.. అని హామీతోనే బిల్లును పాస్ చేసేశాయి. ఎన్నికల ప్రచారంలో వెంకయ్యనాయుడు లాంటి వారు.. తాము అధికారంలోకి రాగానే ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇస్తామంమటూ ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక… మొత్తానికి మొండి చేయి చూపించారు. ఇద్దరూ కలిసి విభజించి.. ఇద్దరూ కలిసి ఇవ్వాలని నిర్ణయించుకున్న హామీని.. బీజేపీ తుంగలో తొక్కేసింది.
గెలిచిన తర్వాత మోడీకి.. తనకి తేడా చూపిస్తారా..?
బీజేపీ అయిపోయింది. ఇక కాంగ్రెస్సే మిగిలింది. తిరుమల వెంకన్న సాక్షిగా.. తాను హామీ ఇస్తున్నానని.. మాటల్లో కాకుండా చేతల్లో చెప్పేందుకు రాహుల్ ప్రయత్నించారు. ప్రత్యేకహోదా ఎన్నికల అంశం. కేంద్రంలో అధికారంలో ఉండగలిగే పార్టీలు రెండే రెండు. ఒకటి బీజేపీ, మరొకటి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల ప్రభుత్వం వచ్చినా.. ఈ రెండింటిలో ఒకటి కచ్చితంగా మద్దతివ్వాలి. బీజేపీ.. ఇప్పటికే హోదా ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెబుతోంది. ఇక మిగిలింది… కాంగ్రెస్. ఆ పార్టీ అధినేత హామీ ఇస్తున్నారు. ఏపీ ప్రజల ముందు ఉన్న ఆప్షన్ ఒకటే. అది ఏ మాత్రం రాంగ్ కాదని.. రాహుల్ … ఆ నమ్మకాన్ని కల్పించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. మరి గెలిచిన తర్వాత రాహుల్… మోడీ.. సేమ్ టు సేమ్ అనిపించుకునేలా చేస్తారా..? హామీయే కాదు.. అమలు కూడా చేసే నేతననే తేడాని కూడా చూపిస్తారా..?