యూరప్ దేశాలలో నూతన సంవత్సర వేడుకలని జరుపుకొనేందుకు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఆదివారం డిల్లీ తిరిగి వచ్చేసారు. రాగానే పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యి ఈ పది రోజులలో దేశంలో జరిగిన రాజకీయ పరిణామాల గురించి అడిగి తెలుసుకొన్నారు. రాహుల్ గాంధీ తిరిగి రాగానే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించవచ్చని ఇదివరకు వార్తలు వచ్చేయి. ఆయన తిరిగి వచ్చేసారు కనుక త్వరలోనే ఆ సమావేశం నిర్వహించి రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలను అప్పగించేందుకు సన్నాహాలు మొదలుపెడతారేమో?
ఇంతవరకు ఒకదాని తరువాత మరొక రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నందున వాటిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే దాని వలన ఆయనకు అప్రదిష్ట కలుగుతుందనే భయంతో రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పగించడానికి సోనియా గాంధీ తటపటాయించేరు. కానీ బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-జెడి.యు-ఆర్.జె.డి. మహాకూటమి విజయం సాధించిన తరువాత రాహుల్ గాంధికి కూడా పార్టీ పగ్గాలు చెప్పట్టేందుకు దైర్యం వచ్చినట్లుంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో బీజేపీని పక్కకు తప్పించి, పిడిపితో కలిసి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేయగలిగినట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగవచ్చును. అప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పజెప్పవచ్చును. కానీ ఈ ఏడాదిలో తమిళనాడు, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించవలసిన భాద్యత రాహుల్ గాంధి తీసుకోవలసి ఉంటుంది. అందుకు వెనకాడినట్లయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధిని మళ్ళీ మరో ఏడాదిపాటు ‘వెయిటింగ్’ లో పెడతారేమో?