కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్భయ ఘటన రాజకీయ సంచలనంగా ఎలా మారిందో…. ఇప్పుడు యూపీలోని హత్రాస్ అత్యాచార ఘటన కూడా అంతే రూపాంతరం చెందుతోంది. యూపీ సర్కార్ చేసిన ఓచిన్న తప్పు కారణంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుల్ని కాపాడేందుకా అన్నట్లుగా చనిపోయిన ఆ బాధితురాలికి అర్థరాత్రి అంత్యక్రియలు చేయడం ఒకటి అయితే..ఆమెపై అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు… తేల్చడం మరో కారణం. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ, ప్రియాంకా గంధీ ప్రత్యేకంగా టేకప్ చేశారు. రెండు రోజుల నుంచి వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. గురువారం.. వారు స్వయంగా హత్రాస్ వెళ్లాలనుకున్నారు.
అయితే అనూహ్యంగా పోలీసులు అడ్డుకున్నారు. యమునా ఎక్స్‌ప్రెస్ హైవే పై వాహనాలను నిలిపివేయడంతో రాహుల్, ప్రియాంక కాలి నడకన బయలుదేరారు. కానీ పోలీసులు నడుచుకుంటూ కూడా పోనివ్వలేదు. ఓ దశలో ఆయనను అడ్డుకోవడానికి పోలీసులు తోపులాటకు దిగారు. రాహుల్ గాంధీ చొక్కా పట్టుకుని లాగేశారు. దాంతో ఆయన కింద పడిపోయారు. ఈ ఘటన కలకలం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీలపై అధికారపార్టీలు చూపిస్తున్న అణిచివేత ధోరణికి ఇదే సాక్ష్యమని విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు కనీసం..ఏదైనా ఘటన జరిపినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నాయి.
ప్రతిపక్ష నేతలు రాజకీయ పర్యటనలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ..అధికారం బలంతో పోలీసుల్ని ఉపయోగించి వెనక్కి పంపేస్తున్నారు. అధికారపార్టీ కార్యకర్తలు ఏం చేసినా సైలెంట్‌గా ఉండి విపక్ష నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఢిల్లీకి కూడా పాకింది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న విమర్శలు అంతకంతకూ పెరగడానికి ఇలాంటి ఘటనలు కారణం అవుతున్నాయి.