ఈ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా కనిపించని పరిస్థితి! ఏపీలో ప్రచారం చెయ్యడానికి మరోసారి రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చెయ్యలేదు. విజయవాడ సభలో ఆయన ఎక్కువగా మోడీ సర్కారు విమర్శలు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు ఇవ్వబోతున్న కనీస ఆదాయ భరోసా వంటి అంశాలపైనే ఎక్కువగా మాట్లాడారు. గడచిన ఐదేళ్లలో మోడీ వల్ల దేశం అన్ని రకాలుగా నష్టపోయిందనీ, పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. దేశాన్ని రెండు ముక్కలు చేశారనీ, ఒకటి పేదల దేశమైతే, మరొకటి కొద్దిమంది మాత్రమే ఉన్న శ్రీమంతుల దేశమని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేదరికంపై పోరాటం చేస్తుందనీ, కానీ మోడీ పేదలపై యుద్ధం చేశారన్నారు.
ఏపీకి సంబంధించి అంశాలపై మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని మరోసారి రాహుల్ గాంధీ చెప్పారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏపీకి ఇచ్చిన ప్రతీ హామీని తాము నెరవేరుస్తామన్నారు. భాజపా ఆంధ్రాని అన్ని రకాలుగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. మోడీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా తాత్సారం చేస్తుంటే, ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయాయన్నారు. ఏపీకి హోదా అనేది కేవలం మన్మోహనో, లేదా ప్రధానమంత్రో ఇచ్చిన హామీ కాదనీ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఆరోజున ఇచ్చిన హామీ అన్నారు.
ఓవరాల్ గా రాహుల్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులూ విరుపులూ లేవు! మరీ ముఖ్యంగా, ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటనేది ఆయన చెప్పలేదు. కేంద్రంలో అధికారంలోకి రాగానే హోదా అంటున్నారే తప్ప, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడుతున్న కాంగ్రెస్ అజెండా ఏంటనేది రాహుల్ ప్రస్థావించలేదు. ఎమ్మెల్యేలుగా ఏపీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎందుకు నిలబడ్డారు, వారిని గెలిపించుకోవడం కోసం పార్టీ ఏం చేస్తుంది, గెలిచినవారి ద్వారా పార్టీ సాధించాలనుకుంటున్న రాజకీయ లక్ష్యాలేంటి… ఇవేవీ ఆయన మాట్లాడలేదు! ఇక్కడి ప్రాంతీయ పార్టీలపై కూడా ఆయన నేరుగా విమర్శలు చెయ్యలేదు. ఆంధ్రాలో స్థానిక సమస్యలే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రాతిపదిక కదా! అలాంటప్పుడు, స్థానికంగా కాంగ్రెస్ పాత్ర, పోరాటం, ప్రయత్నం ఏదో ఒకటి ఉందని చెప్పుకోవాలి కదా! రాష్ట్రస్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రాతినిధ్యం బలంగా ఉండాలనేది రాహుల్ చెప్పలేకపోయారు.