రాష్ట్రంలో రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని, రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాలేదంటూ బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. రేవంత్ రెడ్డి రైతులకు చేసిన మోసంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేలకు లేఖలు కూడా రాశారు.
నిజానికి రుణమాఫీపై కాంగ్రెస్ నేతలు అనుకున్న స్థాయిలో ప్రచారం చేసుకోలేదన్న వాదన బలంగా ఉంది. 2లక్షల రుణమాఫీ అంశంలో కొందరు రైతులకు ఇంకా పెండింగ్ లో ఉంది. కారణం 2లక్షలకు పైబడి ఇంకా అధిక మొత్తం ఉంటే ఆ అధిక మొత్తాన్ని రైతులు బ్యాంకులకు చెల్లిస్తే రెండు లక్షలు మాఫీ అవుతుంది. ఈ నిబంధన కారణంగా చాలా మంది రైతులు మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు సమయం తీసుకుంటున్నారు.
మొదటి రెండు విడతలతో పోలిస్తే మూడో విడతలో ఈ నిబంధనతోనే చాలా మందికి ఇంకా అధికారికంగా మాఫీ కాలేదు. మీరు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు మాఫీ అవుతుంది, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు చెప్తున్నా ఇష్యూ రాజకీయ రంగు పులుముకోవటంతో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి.
అయితే, రాహుల్ గాంధీకి రాసిన లేఖపై ఆయన ఈ నెలాఖరులో ఏర్పాటు చేయబోయే వరంగల్ బహిరంగ సభ ద్వారా కౌంటర్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మీరు 5 సంవత్సరాలు కాలయాపన చేసి, రైతుకు రుణమాఫీ చేలేదు… కానీ, మా కాంగ్రెస్ సర్కార్ చెప్పిన విధంగా చేసి చూపించింది. మీకు మాకు తేడా ఇదే… కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది… అది తెలంగాణ రాష్ట్రం అయినా, రైతు రుణమాఫీ అయినా అని రాహుల్ తో కౌంటర్ ఇప్పించేందుకు టీపీసీసీ రెడీ అవుతోంది.
ఈ నెలాఖరులో సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు రైతు కృతజ్ఞత సభ పేరుతో రాహుల్ గాంధీతో వరంగల్ లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది.