హైదరాబాద్: రాహుల్ గాంధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రత్యర్థులపై తానే విమర్శలతో దాడికి దిగుతున్నారు. ఇవాళ జైపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి, ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడిలపై చెలరేగిపోయారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, ఎన్ని ఆర్డినెన్సులు జారీచేసినా భూసేకరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదముద్ర పొందనిచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అంగుళం భూమినికూడా కోల్పోనీయబోమని చెప్పారు. ఆరునెలల్లో ఆయన 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గిస్తామంటూ పరోక్షంగా ప్రధాని మోడినుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరారు(లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోడి తన 56 అంగుళాల ఛాతీగురించి చెప్పుకున్నారు). రాజస్థాన్లోని వసుంధర రాజే ప్రభుత్వం అలనాటి బ్రిటిష్ ప్రభుత్వంలాగా లండన్ నుంచి రిమోట్ ద్వారా పనిచేస్తోందని రాహుల్ అన్నారు. రాజస్థాన్లో ఉన్నది వసుంధర ప్రభుత్వం కాదని, లలిత్ మోడి ప్రభుత్వమని చెప్పారు. చిన్న మోడి(లలిత్ మోడి)ని లండన్నుంచి రప్పించాల్సిందేనని డిమాండ్ చేశారు.