కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… ఈ సారి దక్షిణాది నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్ లోక్ సభా నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. తన చెల్లి ప్రియాంక వెంటరాగా.. ఆయన రోడ్ షో కూడా చేశారు. అటు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి, ఇటు రోడ్ షోకు కేరళ కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వయనాడ్‌తో రాహుల్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. 1991లో రాజీవ్ గాంధీ అస్తికలను రాహుల్ స్వయంగా తీసుకొచ్చి తిరునెల్లి దగ్గర పాపనాసిని నదిలో నిమజ్జనం చేశారు. పాపనాసిని నది వయనాడ్ పరిధిలో ఉంటుంది. మరో పక్క వయనాడ్ గ్రామీణ నియోజకవర్గం. వయనాడ్‌లో రైతులు కూడా ఎక్కువే. అక్కడి వ్యవసాయదారుల్లో 90 శాతం మంది సన్నకారు, చిన్నకారు రైతులే. పేదరికంలో మగ్గుతున్న వారే. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సహా రైతులకు అనేక హామీలిస్తోంది.
మొదటి నుంచి రైతులే కాంగ్రెస్ పార్టీకి బలం. ఇప్పుడు కూడా అన్నదాతలు తమ పక్షాన ఉంటారన్న నమ్మకంతో రాహుల్ వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు. జాతీయ పార్టీలు దక్షిణాదిని విస్మరిస్తున్నారన్న ఆరోపణల నడుమ ఆ అపవాదును పోగొట్టుకునేందుకు రాహుల్ వయనాడ్‌ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. కేరళలో బీజేపీ బలపడే ప్రయత్నంలో ఉంది. శబరిమల తీర్పు తర్వాత ఉద్యమాలు నిర్వహించి ఆరెస్సెస్ ,తమ భావసారూప్య పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించింది. అక్కడ హిందూ సంస్థలకు అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో దేశం దృష్టని ఆకర్షించే దిశగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఇంతవరకు కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు మాత్రమే బలమైన శక్తులు. మూడో శక్తిగా కేరళలోకి ప్రవేశించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అక్కడున్న ఇరవై లోక్ సభా స్థానాల్లో బీజేపీకి ఒకటి దక్కినా మోదీ అండ్ టీమ్ రెచ్చిపోయే ఛాన్సుంది.
బీజేపీ దూకుడును పసిగట్టిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకు కదిలింది. పైగా దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైపోయిందని కేరళలో ఒక ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు భారీ స్థాయిలో బీజేపీ వైపు పయనించే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. వారిలో మనోధైర్యాన్ని నింపి, కాంగ్రెస్ పార్టీలో ఉంచేందుకే రాహుల్ గాంధీ వయనాడ్ పాచిక వేశారని భావిస్తున్నారు.