ఇప్పుడు హైదరాబాద్ లో నిర్మాణరంగంలో హైడ్రా అంటే హడల్. ఇంతకు ముందు ఉన్నంత నిర్లక్ష్యం ఇప్పుడు భయంగా మారుతోంది. ఆ ఏమౌతుంది లే అనుకునే దగ్గర నుండి ఎందుకు రిస్క్ అనుకునే వరకు ఆలోచనల్లో మార్పు వస్తోంది.
కొన్ని రోజులుగా హైడ్రా దూకుడు… బుల్డోజర్ తో కూల్చివేతలు… అయితే, సోమవారం రాయదుర్గ్ లో కూల్చివేతలు జరిగాయి. అంతా ఇది హైడ్రా పనే అనుకున్నారు. న్యూస్ ఛానల్స్ నుండి వెబ్ సైట్స్ వరకు హైడ్రా కూల్చివేతలుగానే రిపోర్ట్ చేశాయి. రాత్రి కానీ ఇది మా పని కాదు అంటూ హైడ్రా ప్రకటించాక… మరి ఎవరు చేశారు అన్నది సస్పెన్స్ గా మారింది.
అయితే, రాయదుర్గ్ లో కూల్చివేతలు చేసింది జీహెచ్ఎంసీ. అవును… రాష్ట్ర స్టేట్ లెదర్ ఇండస్ట్రీ ప్రమోషన్స్ కు ఉన్న భూమి అది. అక్కడ పాత క్వార్టర్స్ తో పాటు ఐదు అక్రమ నిర్మాణాలున్నాయి. దీనిపై కోర్టులో కేసులు కూడా వేసినా… అది ప్రభుత్వ భూమి అని న్యాయస్థానాలు కూడా తేల్చాయి. అయినా, సదరు ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవటంతో… జీహెచ్ఎంసీ కూల్చివేతలు దిగింది.
ఈ భూమిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యూనిటీ మాల్ ను నిర్మించనున్నాయి. చేనేత కళాకారుల ఉత్పత్తులతో పాటు చేతి వృత్తులు, గిరిజనుల ఉత్పత్తులను సందర్శనకు పెట్టి… అమ్మకం చేపట్టేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆద్వర్యంలో ప్రతి రాష్ట్రంలో ఒక యూనిటీ మాల్ ను ఏర్పాటు చేస్తున్నారని, అది ఇక్కడ నిర్మించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు.