గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టెర్రరిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. ఆయనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఐదారు నెంబర్ల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ను ఆయన మాట్లాడారు. తనను చంపేస్తామని అంటున్నారని.. అలా చెప్పిన వారికి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానని చెప్పుకొచ్చారు.
తనకు టెర్రరిస్టుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని రాజాసింగ్ చెప్పడం ఇదే మొదటి సారి కాదు. పదుల సార్లు చెప్పారు. అలా బెదిరింపులు వచ్చినప్పుడల్లా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఏ నెంబర్లు వచ్చాయో డీటైల్స్ కూడా ఇస్తారు. అవన్నీ ఇతర దేశాల నుంచి వచ్చే కాల్స్. ఓ సారి సీరియస్ గా తీసుకుని పోలీసులు ఎవరు చేశారో కనిపెట్టారు. పాతబస్తీ నుంచి గల్ఫ్ కు వెళ్లిన ఓ యువకుడు ఆ కాల్స్ చేస్తున్నారని గుర్తించారు. ఈ సారి ఓ టెర్రరిస్టు ఫోటో కూడా గుర్తించారు. అది కూడా తాజాగా పోలీసులకు ఇచ్చారు.
తనకుసరైన భద్రత కల్పించాలని రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ కల్పించుకోవాలని అంటున్నారు. రాజాసింగ్ కు గతంలో ముప్పు ఉందని రిపోర్టు రావడంతో సెక్యూరిటీ కల్పించారు. కానీ పాత కారు ఇవ్వడం ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందని దాన్ని ఇచ్చేశారు. సాధారణంగా ఆయన ఎమ్మెల్యే కావడంతో టూ ప్లస్ టూ సెక్యూరిటీ ఉంటుంది. రాజాసింగ్ ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కోరుకుంటున్నారు. మరి రేవంత్ కరుణిస్తారో … తన నెంబర్ ఉగ్రవాదులకు ఇచ్చారని ఆగ్రహిస్తారో చూడాల్సి ఉంది.