మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తానని ప్రకటించారు. స్పీకర్‌ను నేరుగా కలిసి లేఖ ఇస్తానంటున్నారు. అయితే ఆయనకు ఇంత వరకూ స్పీకర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. స్పీకర్‌తో పని లేదు. ఆయన కార్యాలయంలో ఇచ్చినా ఆమోదిస్తారు. అయితే అది ఆమోదించదల్చుకుంటేనే. ఈటల విషయంలో జరిగింది అదే. స్పీకర్ కార్యాలయంలో ఇస్తే అరగంటలో ఆమోదించి.. గంటలో గెజిట్ జారీ చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఆ వేగం కనిపించడం లేదు.
రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం ఉంటుంది. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లయితే వెంటనే స్పీకర్ నుంచి ఆమోదం రావచ్చని, లేనిపక్షంలో పెండింగ్‌లో పడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలవాలని కోరుకున్నా, గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నా వెంటనే స్పీకర్ నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కానీ అలాంటి సూచనలు ఇప్పటి వరకూ కనిపించలేదు.
లేఖ ఇచ్చినా స్పీకర్ వెంటనే ఆమోదం తెలపకపోవచ్చనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మునుగోడుకు మాత్రమే ఉప ఎన్నిక వస్తుందా లేక ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేసి ఒకేసారి రాష్ట్రమంతా నిర్వహించాలనే దిశగా టీఆర్ఎస్ ఆలోచన చేస్తుందా? అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇన్ని టెన్షన్లు ఎందుకు నేరుగా ప్రజాప్రాయం కోరుకుందామని సీఎం అనుకుంటే అదే జరుగుతుంది. ఈ నెల నుంచి ఒక్క సారిగా పది లక్షల మందికిపెన్షన్లు ప్రకటించడంతో పాటు మరికొన్ని నిర్ణయాలు కేసీఆర్ తీసుకోబోతూండటంతో.. కీలక నిర్ణయాలు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.