బాహుబలి నుంచి రాజమౌళి – కరణ్ జోహార్ ల అనుబంధం బలపడింది. ఇప్పుడు `ఆర్.ఆర్.ఆర్` వెనుక కూడా కరణ్ జోహార్ ఉన్నాడు. అయితే.. రాజమౌళితో ఓ సినిమా చేయాలని, ఆ సినిమాకి సోలో నిర్మాతగా తన పేరు ఉండాలన్నది కరణ్ ఆలోచన. ఈ మేరకు కరణ్ – రాజమౌళి మధ్య ఒప్పందం కూడా జరిగిందని ఓ టాక్. కరణ్ నిర్మాతగా రాజమౌళి దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ హిందీ సినిమా రాబోతోంది. అయితే.. ఈ సినిమా రాజమౌళి గత చిత్రాలకంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఇప్పటి వరకూ రాజమౌళి భారీ సినిమాలే తీశాడు. ఈ సినిమానిని మాత్రం ప్రయోగాత్మకంగా తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాలో స్టార్లెవరూ ఉండరని, పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ తరవాత మహేష్ బాబుతో ఓ సినిమా చేయాలి రాజమౌళి. ఆ సినిమా చేయడానికి మధ్యలో ఏమైనా గ్యాప్ వస్తే… బాలీవుడ్ సినిమా పట్టాలెక్కుతుంది. లేదంటే మహేష్ సినిమా అయ్యాక మొదలవుతుంది. రాజమౌళి తన ప్రయాణంలో మర్యాద రామన్న, ఈగ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు తీశాడు. స్టార్లు లేకుండా కూడా హిట్లు కొట్టగలనని నిరూపించాడు. ఇప్పుడు అదే ప్రయత్నం బాలీవుడ్ లో చేయబోతున్నాడు. అంతే తేడా.