గాలి జనార్థన్ రెడ్డి తనయుడు కిరీటీ ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ చిత్రాన్ని వారాహి సంస్థ నిర్మిస్తోంది. ఓ వైపు వారాహి, మరోవైపు గాలి జనార్థన్ రెడ్డి తనయుడు… ఇక భారీ హంగులకు లోటేముంటుంది..? దేవిశ్రీ ప్రసాద్, పీటర్ హెయిన్స్, సింథిల్, ఎస్. రవీందర్…. ఇలా కాస్ల్టీ టెక్నీషియన్లని రంగంలోకి దించేశారు. బడా బడా సినిమాలకు సైతం `డేట్లు ఖాళీ లేవు` అని చెబుతున్న శ్రీలీలని హీరోయిన్ గా దించేశారు. అంతే కాదు… చాలా కాలం తరవాత జెనీలియా వెండి తెరపై కనిపించబోతోంది ఈ సినిమాతోనే. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజే ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ తో.. కిరిటీ తొలిసారి కెమెరా ముందుకు వచ్చాడు.
అయితే.. హీరో పరిచయాన్ని కూడా వెరైటీగా డిజైన్ చేసింది చిత్రబృందం. కిరీటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ టీజర్ కట్ చేసింది. ఈ టీజర్లో.. కిరీటీ యాక్షన్, డాన్స్ నైపుణ్యాల్ని చూపించడానికి ప్రయత్నించింది. ఇది కేవలం కిరీటి ని పరిచయం చేయడానికి మాత్రమే కట్ చేసిన టీజర్. ఇది సినిమాలో ఉండదు. ఓ డెబ్యూ హీరో కోసం స్పెషల్ గా షూట్ చేయడం, దాన్ని కట్ చేసి ఇంట్రడక్షన్ గా వాడుకోవడం, దాన్ని తొలి సినిమాకి క్లాప్ కొట్టక ముందే రిలీజ్ చేయడం ఇదే తొలిసారేమో..?