మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు మహేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ… రాజమౌళి నుంచి ఎలాంటి సర్ప్రైజ్ లేదు. ఈ విషయంలో మహేష్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. రాజమౌళి అంతే. తను వర్క్ ని తప్ప దేని మీదా ఫోకస్ చేయడు. సినిమాకు అవసరం అనుకొన్నప్పుడు అవసరమైన సందర్భాల్లో ప్రమోషన్ మొదలెడతాడు. అంతే తప్ప, పుట్టిన రోజులు, పండగ రోజులూ లెక్కలోనికి రావు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఎక్స్ క్లూజీవ్ న్యూస్ తెలుగు 360కి తెలిసింది. అదేమిటంటే… రాజమౌళి అండ్ టీమ్ ఈ సినిమా కోసం లొకేషన్లు రెక్కీ చేయడానికి సౌతాఫ్రికా వెళ్తున్నారు. అక్కడ ఓ వారం రోజులు పాటు ఉంటారు. అటవీ నేపథ్యంలో సాగే ఎడ్వంచరస్ యాక్షన్ డ్రామా ఈ కథ. ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ చేయాలి. అందుకోసం రియల్ లొకేషన్ల వేటలో ఉన్నాడు రాజమౌళి. సౌతాఫ్రికాలో దట్టమైన అడవులు ఉన్నాయి. అక్కడ షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నాడు రాజమౌళి. ఇందుకు సంబంధించిన లొకేషన్ రెక్కీ కోసం టీమ్ తో పాటుగా సౌతాఫ్రికా వెళ్లబోతున్నాడు.
విలన్ ఎవరు?
ఈ సినిమాలో విలన్ ఎవరన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నిన్నా మొన్నటి వరకూ విక్రమ్ పేరు గట్టిగా వినిపించింది. అయితే విక్రమ్ ఈ సినిమా గురించి స్పందించాడు. ”రాజమౌళితో సినిమా చేయాలని వుంది. మేం చాలాసార్లు మాట్లాడుకొన్నాం. కానీ మహేష్ సినిమా గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు” అని పరోక్షంగానే ఈ సినిమా చేయడం లేదు అని చెప్పేశాడు. ఇప్పుడు విలన్ గా ఫృధ్వీరాజ్ సుకుమారన్ ఫిక్సయ్యాడని అంటున్నారు. ఈ విషయంలోనూ స్పష్టత లేదు. కాకపోతే ఒకటి. విలన్ పాత్రలో దక్షిణాదికి చెందిన నటుడే కనిపించే అవకాశాలు ఉన్నాయి. స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చినా, షూటింగ్ కు వెళ్లడానికి సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబరు లేదా నవంబరులో ఈ సినిమాకు క్లాప్ పడొచ్చు.